- జులై 19న ఢాకాలోని నార్సింగ్ జైలుకు నిప్పుపెట్టి ఖైదీలను విడిపించిన ఆందోళనకారులు
- దేశవ్యాప్తంగా 2,200 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు, హంతకుల పరారీ
- ఆ తర్వాత 1500 మందిని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు
- మిగతా వారి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్న పోలీసులు
సంక్షోభిత బంగ్లాదేశ్‌లో అల్లర్లు, హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. మరోవైపు, షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమ సమయంలో జైళ్లను బద్దలుగొట్టడంతో దేశవ్యాప్తంగా 2,200 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన హంతకులు పెద్ద ఎత్తున పరారయ్యారు. వీరిలో కొందరిని ఆ తర్వాత పట్టుకోగా, ఇప్పటికీ 700 మంది ఆచూకీ తెలియరాలేదని జైళ్ల శాఖ చీఫ్ సయీద్ మహ్మద్ మోతెర్ హోసైన్ తెలిపారు.
ఈ ఏడాది జులై 19న జరిగిన అల్లర్ల సందర్భంగా రాజధాని ఢాకాలోని నార్సింగి జైలుపై వందలాదిమంది దాడిచేసి నిప్పు పెట్టి అందులోని ఖైదీలను విడిపించారు. తప్పించుకుపోయిన ఖైదీల్లో ఆ తర్వాత దాదాపు 1500 మందిని తిరిగి అదుపులోకి తీసుకోగా, ఇంకా 700 మంది ఆచూకీ లేదని, వారిలో 70 మంది ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన ఖైదీలు ఉన్నట్టు వివరించారు. వారి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నట్టు చెప్పారు. షేక్ హసీనా దేశం విడిచిపెట్టి వెళ్లిన తర్వాత బెయిలుపై బయటకు వచ్చిన ఉగ్రవాదులపై నిఘా కొనసాగుతున్నట్టు చెప్పారు.