- రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.0గా నమోదు
- ఉత్తర కాలిఫోర్నియా తీరంలో భూ ప్రకంపనలు
- సునామీ హెచ్చరికలు జారీ చేసిన ఎన్‌డబ్ల్యూఎస్
అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.0గా నమోదైంది. ఉత్తర కాలిఫోర్నియా తీరంలో ఈ భూప్రకంపనలు సంభవించాయి. దీంతో యూఎస్ జియోలాజికల్ సర్వే ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్‌డబ్ల్యూఎస్) సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, గురువారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.44 గంటలకు ఉత్తర కాలిఫోర్నియాలోని హంబోల్ట్ కౌంటీలో 100 కి.మీ వాయువ్య ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది.
ఇది మొదట 6.6 తీవ్రతతో కూడిన భూకంపంగా పేర్కొనబడింది. ఆ తర్వాత దీన్ని యూఎస్‌జీఎస్ 7.0గా గుర్తించింది. భూకంప కేంద్రం 0.6 కి.మీ లోతులో గుర్తించినట్లు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.
ఇక కాలిఫోర్నియాలో సుమారు 5.3 మిలియన్ల మంది ప్రజలు యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ జారీ చేసిన సునామీ హెచ్చరిక ప్రాంతంలో ఉన్నారు. ఒరెగాన్ స్టేట్ లైన్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా వరకు ఈ సునామీ హెచ్చరికలు ఉన్నాయి.