- సిరియాలో రెండో అతి పెద్ద పట్టణం అలెప్పోను స్వాధీనం చేసుకున్న తిరుగుబాటుదారులు
- వేలాది మంది తిరుగుబాటు దారులతో కలిసి హెచ్‌టీఎస్‌ను స్థాపించిన జులానీ
- అతి పెద్ద ప్రతిపక్ష సాయుధ దళానికి అధిపతిగా మారిన జులానీ
గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సిరియాలో మరోసారి తిరుగుబాటు తారస్థాయికి చేరుకోవడంతో సంక్షోభం ముసురుకుంటోంది. ఆ దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు దారులు విజృంభిస్తున్నారు. మూడు రోజుల్లోనే సిరియాలో రెండో అతి పెద్ద పట్టణం అలెప్పోను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ దాడుల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి అబు మహ్మద్ అల్ జులానీ ఎవరు..? అతడి నేపథ్యం ఏమిటి ? అనే చర్చ జరుగుతోంది. అలెప్పో నగరంపై తాజా దాడి వెనుక ఒకప్పటి అల్ ఖైదా అనుబంధ సంస్థ హయాత్ తహరీర్ అల్ షమ్ (హెచ్‌టీఎస్)ది కీలక పాత్ర కాగా, సిరియాలోనే అత్యంత పటిష్ఠమైన తిరుగుబాటు దళమిది. దీని అధిపతే అబు అమ్మద్ అల్ జులానీ.
జులానీ గతంలో జరిగిన రష్యా దాడుల్లో మృతి చెందాడని అంతా భావించారు. అయితే ప్రస్తుతం హెచ్‌టీఎస్‌ను అతనే ముందుండి నడిపిస్తుండటంతో జులానీ మృతి చెందాడని వచ్చిన వార్తలు అన్నీ అవాస్తవమేనని తేలింది. జులానీ పూర్వీకులు సిరియాకు చెందిన వారు కాగా, ఆయన తండ్రి అహ్మద్ హుస్సేన్ అల్ షారా సౌదీ అరేబియాలో పెట్రోలియం ఇంజినీర్‌గా పని చేశాడు. 1982లో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జులానీ జన్మించగా, ఆ కుటుంబం 1989లో మళ్లీ సిరియాకు వచ్చి డమాస్క్‌లో స్థిరపడింది. అక్కడే పెరిగిన జులానీ 2003లో ఇరాక్ వెళ్లి అక్కడ అల్ ఖైదాలో జాయిన్ అయ్యాడు.
2006లో అమెరికా దళాలు ఆతన్ని అరెస్టు చేయగా, ఐదేళ్ల తర్వాత విడుదలయ్యాడు. తర్వాత తిరిగి సిరియాకు చేరుకుని అల్ ఖైదా శాఖను జులానీ ప్రారంభించాడు. అల్ నర్సా ఫ్రంట్ ను ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న ఇడ్లిబ్ లాంటి ప్రాంతాల్లో బలమైన శక్తిగా ఎదిగాడు. ఆ తర్వాత అల్ ఖైదాతో విభేదాల కారణంగా దానికి దూరంగా జరుగుతూ సిరియా సరిహద్దులో తన బలాన్ని జులానీ పెంచుకున్నాడు. 2016లో అలెప్పో నగరంలో తిరుగుబాటు దారులపై సాయుధ బలగాలు దాడులకు దిగడంతో వారంతా ఇడ్లిబ్ వైపు కదిలారు. అదే సమయంలో తన అల్ నర్సా గ్రూప్‌ను జులానీ .. ఫతేహ్ అల్ షామ్‌గా మార్చి వేలాది మంది తిరుగుబాటు దారులతో కలిసి 2017లో హెచ్‌టీఎస్‌ను స్థాపించాడు. పలు ఉగ్ర సంస్థలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి.
అసద్ నిరంకుశ ప్రభుత్వం నుంచి సిరియాను విముక్తి చేయడమే తమ లక్ష్యమని హెచ్‌టీఎస్ చెబుతూ.. సిరియా నుంచి ఇరానియన్లను బహిష్కరించి ఇస్లామిక్ చట్టం ప్రకారం నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని హెచ్‌టీఎఫ్ లక్ష్యంగా పెట్టుకుంది. అధ్యక్షుడు అల్ అసద్ వ్యతిరేకులందర్నీ ఏకతాటిపైకి తీసుకొని వస్తూ జులానీ హెచ్‌టీఎస్‌పై ఉన్న అల్ ఖైదా ముద్రను తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. తన ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో పౌర పాలనపై హెచ్‌టీఎస్ దృష్టి పెట్టి మైనార్టీలకు చేరువయ్యే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో సిరియాలో అతి పెద్ద ప్రతిపక్ష సాయుధ దళానికి అధిపతిగా జులానీ పేరు ప్రపంచ స్థాయిలో మారుమోగుతోంది.