ఆ విషయంలో నా తండ్రిని వేడుకున్నాను: మంచు మనోజ్
- మంచు ఫ్యామిలీలో తారస్థాయికి చేరుతున్న గొడవ
- తనపై దాడి చేశారంటూ పహాడీ షరీఫ్ పీఎస్‌లో మనోజ్ ఫిర్యాదు
- కాసేపటికే తన కొడుకుపై మోహన్‌బాబు పోలీసులకు ఫిర్యాదు
- రాచకొండ సీపీకి లేఖ.. మనోజ్‌తో పాటు కోడలి నుంచి ముప్పు పొంచి ఉందన్న మోహన్‌బాబు
- తండ్రి లేవనెత్తిన అంశాలు పూర్తిగా తప్పు అన్న మనోజ్
- ఈ వివాదంలోకి తన ఏడు నెలల కూతుర్ని కూడా లాగడం బాధాకరమని వ్యాఖ్య
- తన వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా తన జీవితాన్ని నిర్మించుకుంటున్నానని వెల్లడి
మంచు ఫ్యామిలీలో గొడవ తారస్థాయికి చేరుతోంది. తనపై దాడి చేశారంటూ మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, మనోజ్ ఫిర్యాదు చేసిన కాసేపటికే తన కొడుకుపై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన రాచకొండ సీపీకి లేఖ రాశారు. మనోజ్‌తో పాటు కోడలు మౌనిక నుంచి తనకు ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.
ఇక తన తండ్రి మోహన్‌బాబు ఫిర్యాదుపై మనోజ్ స్పందించారు. తనతో పాటు తన భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తన తండ్రి లేవనెత్తిన అంశాలు పూర్తిగా తప్పే కాకుండా, తన పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో భాగమిదని ఆయన ఆరోపించారు. తనపై, తన భార్యపై ఆరోపణలు పూర్తిగా కల్పితం అన్నారు.
తాను, తన భార్య మౌనిక సొంత కాళ్లపై నిలబడి సంపాదించుకుంటున్నామని మనోజ్ తెలిపారు. తన సోదరుడు కొన్ని కారణాల రీత్యా దుబాయికి వెళ్లడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోందని.. నాన్న, ఆయన స్నేహితుల కోరిక మేరకు తాను కుటుంబానికి చెందిన ఇంట్లో గత ఏడాది కాలంగా ఉంటున్నానని మనోజ్ చెప్పారు. అయితే, తప్పుడు ఉద్దేశంతో తాను నాలుగు నెలల క్రితం ఆ ఇంట్లోకి వచ్చానని తన తండ్రి చేసిన ఫిర్యాదులో నిజం లేదన్నారు.
ఈ వివాదంలోకి తన ఏడు నెలల కూతుర్ని కూడా లాగడం బాధాకరమన్నారు. ఇది ఎంతో అమానవీయం, ఇలాంటి విషయాల్లోకి తన పిల్లలను లాగొద్దని మనోజ్ అన్నారు. ఇలా వారిని గొడవలోకి లాగడంతోనే ఈ ఆరోపణల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుస్తోందని పేర్కొన్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని పేర్కొన్నారు.
ఇక తన తండ్రి ఇలా ఫిర్యాదు చేయడం యాదృచ్ఛికం కాదన్నారు. తన సోదరుడు విష్ణు, ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి.. మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) విద్యార్థులను, స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారు. వారికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడినందుకే ఈ ఫిర్యాదు చేశారని మనోజ్ తెలిపారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, కావాలంటే వాటిని అధికారులకు సమర్పిస్తానని ఆయన పేర్కొన్నారు.
విష్ణు స్వలాభం కోసం కుటుంబం పేరును వాడుకున్నాడని, తానెప్పుడూ స్వతంత్రంగానే ఉన్నానన్నారు. విష్ణు కుటుంబ వనరులను దుర్వినియోగం చేశాడని, అయినా తన తండ్రి ఎప్పుడూ అతనికే మద్దతుగా ఉన్నాడని మనోజ్ తెలిపారు. తాను మాత్రం పరువు నష్టం, వేధింపులకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు.
కుటుంబ వివాదాల పరిష్కారం కోసం నిజాయతీగా, అందరిముందు చర్చలు జరపాలని గత సెప్టెంబర్‌లో హృదయపూర్వకంగా తన తండ్రిని వేడుకున్నానని మనోజ్ అన్నారు. అయితే, తండ్రి మోహన్‌బాబు తనను పట్టించుకోలేదని, ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నానని వాపోయారు.
ఇంట్లో సీసీటీవీ ఫుటేజీ మాయం కావడంపై కూడా మనోజ్ ఆందోళన వ్యక్తం చేశారు. విష్ణు అనుచరులైన విజయ్ రెడ్డి, కిరణ్ వాటిని ఎందుకు తొలగించారని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటన తీవ్రమైన ఆందోళనను, ప్రశ్నలను రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. వారు ఎందుకు ఆ ఫుటేజీలను దాచిపెడుతున్నారని మనోజ్ నిలదీశారు. విచారణ జరిపి దాని వెనకున్న నిజాన్ని కనుగొనాలని కోరారు.
కుటుంబ ఆస్తుల కోసం తానెప్పుడూ ఆశ పడలేదన్నారు. కుటుంబ ఆస్తిపాస్తులపై ఆధారపడకుండా తన పిల్లలను పెంచుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని మనోజ్ అన్నారు. కేవలం తన వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా తన జీవితాన్ని నిర్మించుకుంటున్నానని చెప్పారు. ఎనిమిదేళ్లుగా తండ్రి, సోదరుడి సినిమాలకు విశ్రాంతి లేకుండా పని చేశానని పేర్కొన్నారు. ఫ్యామిలీ గురించి ఆలోచించి ఒక్క రూపాయి తీసుకోకుండా పని చేశానన్నారు. సోదరుడు విష్ణు ఇంకా కుటుంబం నుంచి మద్దతు పొందుతూనే ఉన్నాడని మనోజ్ తెలిపారు.