Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలో సినీ పాత్రికేయులకు విశిష్ట సత్కారం..

  • ఎన్టీఆర్ సినీ జీవితానికి 75 ఏళ్లు
  • పోరంకిలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుక
  • ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
  • సీనియర్ సినీ జర్నలిస్టులకు మెమెంటోల బహూకరణ

కృష్ణా జిల్లా పోరంకిలో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమంలో సీనియర్ సినీ పాత్రికేయులను ఘనంగా సన్మానించారు. ఎన్టీఆర్ డైమండ్ జూబ్లీ పేరిట ప్రత్యేకంగా తయారుచేయించిన జ్ఞాపికలను ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్ సినీ జర్నలిస్టులకు బహూకరించారు. మోహన్ గోటేటి, బీకే ఈశ్వర్, కె.ఉడయవర్లు, కె.ఉమామహేశ్వరరావు, గౌస్, శాతవాహన, యు.వినాయకరావు, రెంటాల జయదేవ, అనురాధ, రమణమూర్తి తదితర పాత్రికేయులు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మెమెంటోలు అందుకున్నారు. 

కాగా, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీఎం చంద్రబాబు, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ స్పెషల్ క్యాలెండర్ ను కూడా ఆవిష్కరించారు. 

దాంతోపాటే, తారకరామం-అన్న గారి అంతరంగం పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఎన్టీఆర్ సినిమా కెరీర్ విశేషాలు, పలు ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు, ఆయన గురించి సమాచారాన్ని, ఆయన గురించి ఇతర ప్రముఖులు చెప్పిన మాటలను పొందుపరిచారు.

ఎన్టీఆర్ ను చరిత్ర మర్చిపోదు: వెంకయ్యనాయుడు

 Venkaiah Naidu speech in NTR Diamond Jubille celebrations

ఎన్టీఆర్ కారణజన్ముడు అని, ఆయన వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఇవాళ కృష్ణా జిల్లా పోరంకిలో నిర్వహించిన ఎన్టీర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఎన్టీఆర్ లో తనకు అన్నిటికంటే బాగా నచ్చేది క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం అని వెల్లడించారు. ఈ మూడు ఉంటే జీవితంలో ఎవరైనా పైకి వస్తారని, ఈ మూడింటిని అలవర్చుకోవడమే మనం ఆ మహనీయుడికి అర్పించే నివాళి అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 

“ఎన్టీ రామారావు గారు విలక్షణమైన వ్యక్తిత్వం కలిగినవారు. ఆయనకు క్యారెక్టర్, కాలిబర్, కెపాసిటీ, కాండక్ట్… ఇవన్నీ ఆయనకు నిండుగా, మెండుగా ఉన్నాయి. లోతుగా గమనిస్తే ఆయన సినిమాల్లోని మాటల్లో, పాటల్లో ఒక సందేశం ఉంటుంది. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్ గా సినీ చరిత్రలో ఎన్టీఆర్ గారి స్థానం సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఆయన ఏకాగ్రత అమోఘం. ఏదైనా ఒకటి అనుకుంటే పూర్తయ్యేదాకా విశ్రమించరు. కొన్ని పాత్రల కోసం ప్రత్యేక ఆహార నియమాలు పాటించేవారు. అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఆయనకే చెల్లింది. 

కథానాయకుడిగానే కాకుండా ప్రతినాయకుడిగానూ తన నటనా వైదుష్యాన్ని చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. అందుకు ఉదాహరణ రాముడి పాత్ర, రావణుడి పాత్ర. రావణబ్రహ్మలోని విశేషాలన్నింటినీ ఎన్టీఆర్ తన నటన ద్వారా చూపించారు. అలాగే శ్రీకృష్ణుడి పాత్ర పోషించారు, ధుర్యోధనుడి పాత్ర పోషించారు… ఆయనకు ధుర్యోధనుడు అనడం ఇష్టం ఉండదు… సుయోధనుడు అంటుంటారు. ధుర్యోధనుడిలోని మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, వాటిని కూడా బయటికి తీసుకువచ్చారు. 

ఎన్టీ రామారావు స్ఫురద్రూపి, అందగాడు. ఎంతో ఆకర్షణీయంగా, ఎంత సేపు చూసినా ఇంకా చూడాలనిపించే రూపం ఆయనది. ఆ అదృష్టం అందరికీ రాదు… వేషం వేసినా, వేషం వేయకపోయినా రామారావు రామారావే… ఆయనకు ఆయనే సాటి. సినీ నటులకు బిరుదులు ఇవ్వడం సాధారణ విషయం. అభిమానులు తమ ఆరాధ్య నటులను పొగుడుకుంటారు. ఎన్టీఆర్ ను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటారు… ఆయన నటన ప్రపంచవ్యాపితం… ఇది వాస్తవం. తెలుగువారి ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. 

డైలాగులతో ఆయన చేసే స్వర విన్యాసం, హావభావాలతో చేసే నట విన్యాసం… ఈ రెండు కూడా అద్భుతమైనవి. ఎవరూ ఇష్టపడని బృహన్నల పాత్రను అద్భుతంగా పోషించారు. అదే సమయంలో అర్జునుడిగానూ నటించారు. శ్రీకృష్ణుడిగా, ధుర్యోధనుడిగా… ఇలా ఏ పాత్ర పోషించినా, ఆ పాత్రలో అలా నిలిచిపోయారు.

ఓసారి ఆచార్య రంగా గారు ఆసక్తికర విషయం చెప్పారు. ఆయన తన సేవకుడిని ఓటేసి రమ్మని పంపారట. హస్తం గుర్తుపై ఓటేసి రమ్మని చెప్పాడట… కానీ ఓటేసి వచ్చిన తర్వాత అతను నక్కి నక్కి నడుస్తున్నాడట. చెయ్యి గుర్తుకు ఓటు వేశావా అని అడిగితే… ఆ గుర్తుకే ఓటు వేయబోతే… సైకిల్ గుర్తుకు ఉన్న చక్రంలో శ్రీకృష్ణుడు కనిపించి సైకిల్ కు ఓటేయమని చెప్పాడయ్యా… సైకిల్ కు వేశాను అని ఆ సేవకుడు చెప్పాడట. అంటే… శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో మనం చూడలేదు… శ్రీకృష్ణుడు అంటే ఇలా ఉంటాడు అని రామారావు రూపం ప్రజల్లోకి వెళ్లిపోయింది. దానికి కారణం ఆయన ప్రదర్శించిన నటనా కౌశలం. 

ఇవాళ ఆయన వజ్రోత్సవం జరుపుకుంటున్నాం. గ్రామాల్లో ఎన్టీవోడు అని పిలుచుకునేవారు. పౌరాణిక పాత్రల్లో పరకాయప్రవేశం చేశారు. చిన్న వయసులోనే భీష్ముడి పాత్ర పోషించారు. అంతేకాదు, తాను మెచ్చిన మహనీయుల పాత్రలను అందంగా చెక్కి మనముందుంచే ప్రయత్నం చేశారు. శ్రీనాథ కవిసార్వభౌమ చిత్రంలో నటించి మెప్పించారు. శ్రీనాథుడి పేరుతో సినిమా తీయడం అంత సులభం కాదు. చరిత్రలో తనకు నచ్చిన పాత్రల్లో నటించి మెప్పించడం ఆయనకే చెల్లింది. 

ఆయనకు తెలుగు భాషపై ఉండే అభిమానం నాకు బాగా నచ్చుతుంది. ఆయన తాను స్థాపించిన పార్టీకి కూడా తెలుగుదేశం అని పెట్టుకున్నారు. అప్పట్లో అందరూ… తెలుగుదేశం ఏంటని ఆశ్చర్యపోయారు. అప్పట్లో నన్ను అడిగారు… మీరు తెలుగుదేశంలో చేరతారా అని… లేదయ్యా, నేను భారతదేశంలోనే ఉంటాను అని చెప్పాను. కానీ పార్టీ పెట్టి కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ ను మట్టికరిపించి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మొట్టమొదటగా ఓడించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కింది. ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ పేరిట ఢిల్లీలోనూ కాంగ్రెస్ పెత్తనాన్ని సవాల్ చేశారు. 

వెనుకబడిన వర్గాలను కూడా ప్రోత్సహించి రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. ఎన్టీఆర్ కారణంగా ఒక తరం వారు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. రామారావుకు ఆడపడుచులపై అభిమానం ఉండేది. అందుకే వారికి ఆస్తి హక్కు కల్పించారు… ఈ విషయాన్ని చరిత్ర మర్చిపోదు. మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు ఆయన ఘనతే. అంతేకాదు, అవినీతిపరుల గుండెల్లో సింహస్వప్నంలా నిలిచారు. అక్రమార్కుల పాలిట ఆయన చండశాసనుడు. 

ఒకరకంగా చెప్పాలంటే ఆయన తక్కువ వయసులోనే అర్ధంతరంగా వెళ్లిపోయినట్టు భావించాలి. ఇది తెలుగు ప్రజలకు తీరనిలోటు. ఆయన జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా తీసుకురావాలి. అందులో ఎలాంటి తప్పులేదు… దీన్ని రాజకీయంగా ఎవరూ తప్పుబట్టే అవకాశం లేదు. రామారావు రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు” అని వెంకయ్యనాయుడు వివరించారు.

మనకు తెలిసిన, మనం చూసిన ఏకైక యుగపురుషుడు ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు

CM Chandrababu speech in NTR Diamond Jubilee celebrations

జగద్విఖ్యాత మహా నటుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నందమూరి తారకరామారావు తొలి చిత్రం మనదేశం విడుదలై 75 ఏళ్లయిన సందర్భంగా ఈ వేడుక జరుపుకుంటున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మనదేశం చిత్ర నిర్మాత కృష్ణవేణి గారు కూడా హాజరవడం విశేషమని అన్నారు. ఆమెకు ఇప్పుడు 102 సంవత్సరాలని, ఆమె పట్టుదలను మెచ్చుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో పట్టుదలతో రావడమే కాకుండా, ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా ప్రశాంతంగా కూర్చున్నారని వివరించారు. అందుకు కారణం ఆమె జీవితంలో క్రమశిక్షణ అని వ్యాఖ్యానించారు. 

ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు రావడం హర్షణీయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దగ్గుబాటి సురేశ్, మాజీ ఎంపీ జయప్రద, ప్రభ, కృష్ణంరాజు అర్ధాంగి శ్యామల, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కేఎస్ రామారావు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో సమర్థంగా నిర్వహిస్తున్నందుకు టీడీ జనార్ధన్ ను అభినందిస్తున్నానని తెలిపారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ లేకపోతే ఈ కార్యక్రమం లేదని అన్నారు. 

ఎన్టీఆర్ కు భారతరత్న సాధిస్తామని, ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడం అంటే తెలుగుజాతిని గౌరవించడమేనని స్పష్టం చేశారు.

 రెండింటికి అర్థం… ఎన్టీఆర్

ఇవాళ మనం ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక జరుపుకుంటున్నాం. ఇదొక అపూర్వ ఘట్టం. గతేడాది ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరుపుకున్నాం. సంవత్సరమంతా ఉత్సవాలు జరుపుకున్నాం. ఒక యుగపురుషుడు జన్మించినప్పుడు చరిత్ర అతడిని మర్చిపోదు. అందుకు ఎన్టీఆర్ ఒక ఉదాహరణ. ఒక దేశంలో అని కాదు… ప్రపంచంలోని అనేక దేశాల్లో  ఆయన శతజయంతి వేడుకలు జరుపుకున్నాం. మరోసారి ఆయన పేరిట సినీ వజ్రోత్సవ వేడుక ఏర్పాటు చేసుకోవడం, మళ్లీ మనందరం ఆయన గురించి మాట్లాడుకోవడం సంతోషదాయకం. 

ఎన్టీఆర్ వంటి యుగపురుషులు అరుదుగా పుడతారు. మనకు తెలిసిన, మనం చూసిన ఏకైక యుగపురుషుడు ఎన్టీఆర్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, తెలుగుజాతి పేరు వింటేనే గుర్తుకు వచ్చే వ్యక్తి ఎన్టీఆర్. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి హృదయాల్లో ఉండే వ్యక్తి ఎన్టీఆర్. అచ్చమైన తెలుగుదనం, తెలుగువాడి ఆత్మగౌరవం… ఈ రెండింటికి అర్థం ఎన్టీఆర్. 

చరిత్రలో ఇలా ఎక్కడా జరగలేదు

ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి, తెలుగు సినీ చరిత్రలో ఒక ఎవరెస్ట్ లా ఎదగడం, తొమ్మిది నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదు… భవిష్యత్తులోనూ జరుగుతుందన్న నమ్మకం లేదు… జరగదు. ఇటు  వెండితెరను, అటు రాజకీయాలను ఏలిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఎన్టీఆర్ ఒక్కరే. రంగం ఏదైనా ఆయన అడుగుపెట్టిన ప్రతి చోటా సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. 

ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మనదేశం… విడుదలై 75 సంవత్సరాలవుతోంది. ఇవాళ ఆయన లేకపోయినా మనం ఈ వేడుక జరుపుకుంటున్నామంటే అదీ ఎన్టీఆర్ గొప్పదనం. ఒక్కోసారి యుగపురుషుల చరిత్ర కూడా మనం నెమరువేసుకోవాలి. వారి జీవితాల నుంచి స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉంది. 

ఆ రైలెక్కాక ఎన్టీఆర్ జైత్రయాత్ర మొదలైంది

నిమ్మకూరు అనే పల్లెటూరులో వెంకట్రామమ్మ,లక్ష్మయ్య చౌదరి దంపతులకు 1923 మే 28న జన్మించిన కారణజన్ముడు ఎన్టీఆర్. నేను ఆయనను కలిసి చాలాసార్లు మాట్లాడినప్పుడు… అప్పుడప్పుడు తన చరిత్రను, జీవితంలోని సంఘటనలను నాకు కొంచెం చెప్పేవారు. చదువు కోసం విజయవాడకు వచ్చేవారు. తెల్లవారుజామునే లేచి… తల్లికి సాయంగా అనేక పనులు చేసేవారు. పాలను విక్రయించేవారు… ఆ తర్వాత కాలేజికి వెళ్లేవారు. జీవితం మొదట్లో అందరికీ కష్టాలు ఉంటాయి… ఆ తర్వాత మనశక్తిని బట్టి మన జీవితాన్ని మలుచుకుంటాం. 

1945లో మద్రాసు రైలెక్కాక ఎన్టీఆర్ జైత్రయాత్ర మొదలైంది. సినిమా రంగంలో ఆయన మొదట్లో నెలవారీ జీతం తీసుకునేవారు. ఎల్వీ ప్రసాద్, నాగిరెడ్డి, చక్రపాణి తదితరులు ఆయనకు సినిమాల్లో అవకాశాల కోసం సహకరించారు. ఆ తర్వాత సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక సినిమాల్లో నటించి, ఆయా పాత్రలకు ప్రాణం పోశారు. 300 సినిమాల్లో నటించారు. అప్పట్లో ఆయన ఏడాదికి 10 నుంచి 15 సినిమాలు చేసేవారు. ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే మూడేళ్లు పడుతోంది. కానీ ఎన్టీ రామారావు మాత్రం పెద్ద సంఖ్యలో సినిమాల్లో నటించేవారు. 

 అలాంటి నటులు మరొకరు దొరకరు… కనిపించరు!

భారతదేశ సినీ చరిత్రలో ఎన్టీఆర్ లా విభిన్న పాత్రలు పోషించే నటులు మరెవరూ లేరు… దొరకరు… కనిపించరు! ఆయన ఏ పాత్ర పోషించినా… ఆ పాత్రలో జీవించారు. వెంకటేశ్వరస్వామి పాత్ర వేయాలన్నా, శ్రీకృష్ణుడి పాత్ర వేయాలన్నా, రాముడిగా నటించాలన్నా ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు. ఆ సమయంలో మాంసాహారం తినేవారు కాదు… ఇంట్లో మంచం మీద కాకుండా చాప మీద పడుకునేవారు. నిబద్ధతకు ఉదాహరణలా నిలిచారు. దేవుడు ఎలా ఉంటాడో ఆ రూపం మనకు తెలియదు కానీ, ఎన్టీఆర్ రూపంలో దేవుడ్ని చూస్తున్నాం. 

ఓసారి ఎన్టీఆర్ గారిని అడిగాను… మీరు రాముడిగా నటిస్తారు, రావణుడిగా నటిస్తారు… శ్రీకృష్ణుడిగా నటిస్తారు, ధుర్యోధనుడిగా నటిస్తారు… ఎలా సమన్వయం చేసుకుంటారు అని అడిగాను. అందుకాయన ఒకటే మాట చెప్పారు… ఏ క్యారెక్టర్ కు ఆ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది… వాళ్లు విలక్షణ వ్యక్తిత్వం ఉన్నవారు. వాళ్ల వ్యక్తిత్వాలు కూడా విశిష్టంగా ఉంటాయని ఆ క్యారెక్టర్లను జస్టిఫై చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఆయా క్యారెక్టర్లలోని మంచి గుణాలు నచ్చి, ఆ పాత్రలు పోషించాడు. 

దానవీరశూరకర్ణలో మూడు పాత్రలు పోషించి, మళ్లీ దర్శకత్వం కూడా వహించారు. నేను చేయలేనిది ఏదీ లేదు… ఏదైనా సరే చేసి చూపిస్తాను అని చేసి చూపించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. అందుకే సినిమాల్లో 24 క్రాఫ్ట్స్ గురించి తెలిసిన ఏకైక కథానాయకుడు నందమూరి తారకరామారావు. 

నా చిన్నప్పుడు లవకుశ సినిమా చూశాను. ఎక్కడో పల్లెటూరి నుంచి ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చి ఆ సినిమా చూసేవారు. ఇలాంటివి ఎన్నో. పోతులూరి వీరబ్రహ్మంగారి చరిత్ర, శ్రీనాథ కవిసార్వభౌమ వంటి సినిమాల కోసం ఎంతో రీసెర్చ్ చేసి ఆయా పాత్రలు పోషించారు. తోడుదొంగలు సినిమాకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. 

రాజకీయాల్లోనూ ఆయన హీరో

సినిమాల్లో హీరోగా చేసినట్టే… రాజకీయాల్లోనూ నిజమైన హీరో అనిపించుకున్నారు. నేను ఆయనను కలిసిన తర్వాత నా పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఆయనతో ఓసారి చర్చ జరిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే… 60 ఏళ్లు నేను కుటుంబం కోసం బతికాను. ప్రజలు నన్ను ఆదరించారు. తిరిగి నా శేషజీవితాన్ని ఈ ప్రజలకు అంకితం చేయాలనుకుంటున్నానని చెప్పి, రాజకీయాల్లోకి ప్రవేశించారు. 

చైతన్యరథం ఎక్కి 9 నెలలు రాష్ట్రమంతటా తిరిగారు. పిల్లల పెళ్లిళ్లకు కూడా రాకుండా ఆయన సమాజం కోసం అంకితమయ్యారు. 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన స్థాపించిన పార్టీ శాశ్వతంగా ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంతవరకు నందమూరి తారకరామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుంది. మేం ఆన్ లైన్ లో పార్టీ సభ్యత్వాలు నమోదు చేస్తుంటే, ఇప్పటికే 73 లక్షల మంది సభ్యత్వాలు తీసుకోవడం టీడీపీ శక్తికి నిదర్శనం. 

ఆయన తెలుగుజాతి పౌరుషం, తెలుగుజాతి ఆత్మగౌరవం

తెలుగుజాతి ఆత్మగౌరవం, తెలుగుజాతి పౌరుషం అంటే ఎన్టీఆర్ గుర్తొస్తారు. మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు సంక్షేమ పథకాలు అనేవే లేవు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు… ప్రభుత్వం అంటే పరిపాలన, పెత్తందారు వ్యవస్థ అన్నట్టుగా ఉండేది. కానీ కూడు, గూడు, గుడ్డ నినాదంతో పాలనకు కొత్త అర్థం చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఇప్పుడు మేం కూడా ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరిక నిర్మూలనకు కృషి చేయడమే కాకుండా… ఆర్థిక అసమానతలను తగ్గించే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది” అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.

Related posts

వివాదంలో వైసీపీ రాజ్యసభసభుడు విజయసాయిరెడ్డి….

Ram Narayana

చంద్రబాబు అరెస్ట్ పై మంద కృష్ణ స్పందన

Ram Narayana

నిరసనలు ఏపీలో చేసుకోవాలన్న కేటీఆర్… హైదరాబాదులో కూడా తెలుగువాళ్లు ఉన్నారంటూ లోకేశ్ కౌంటర్!

Ram Narayana

Leave a Comment