- అసలే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం
- వెంట లగేజీ ఎక్కువగా ఉంటే దానికి అదనంగా చార్జీలు
- ఈ క్రమంలోనే కొత్తగా మొదలైన ట్రెండ్
దూర ప్రాంతాలకు కూడా అత్యంత వేగంగా, సుఖవంతమైన ప్రయాణంతో వెళ్లగలగడం విమానాలతోనే సాధ్యం. కానీ విమాన ప్రయాణం అంటేనే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. వెంట ఏమాత్రం ఎక్కువ లగేజీ తీసుకెళ్లినా అడ్డగోలుగా చార్జీలు కట్టాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ‘నేకెడ్ ఫ్లయింగ్’ అనే విధానం ట్రెండింగ్ గా మారింది.
ఏమిటీ ‘నేకెడ్ ఫ్లయింగ్?’
నేకెడ్ ఫ్లయింగ్ అంటే… మరీ బట్టలు లేకుండానో, చిట్టి పొట్టి వస్త్రాలతోనో వెళ్లడం కాదు. మన చేతిలో పట్టుకునే వస్తువులేవీ… అంటే బ్యాగులు, ల్యాప్ టాప్ లు వంటివేవీ లేకుండా విమాన ప్రయాణం చేయడమే ‘నేకెడ్ ఫ్లయింగ్’. మనం వెంట తీసుకెళ్లేది ఏదైనా సరే మన చొక్కా, ప్యాంట్ కు ఉండే పాకెట్లలోనే ఇమిడిపోవాలన్న మాట. ఇది టిక్ టాక్ లో ఓ చాలెంజ్ గా మొదలైంది. తర్వాత సోషల్ మీడియా అంతటా ట్రెండింగ్ గా మారింది.
దీనితో ఏమిటి ప్రయోజనం?
- ‘నేకెడ్ ఫ్లయింగ్ తో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయనే వాదన జరుగుతోంది.
- వీలైనంత తక్కువ లగేజీతో ప్రయాణం ఎప్పుడూ కూడా మంచిదని, విమానాల్లో లగేజీ చార్జీలు చెల్లించాల్సి రావడం, విమానాశ్రయాల నుంచి రాకపోకలకు అయ్యే ఖర్చులు బాగా తగ్గిపోతాయని చెబుతున్నారు.
- ఇక విమానాలు నడిచేందుకు చాలా ఎక్కువ ఇంధనం అవసరం. బరువు పెరిగిన కొద్దీ విమానంలో ఎక్కువ ఇంధనం ఖర్చవుతూ ఉంటుంది. వీలైనంత తక్కువ లగేజీతో వెళితే… బరువు తక్కువగా ఉండి, విమాన ఇంధనం ఖర్చు తగ్గుతుందని, ఇది పర్యావరణానికి ఎంతో మంచిదనే వాదనలు ఉన్నాయి.
- భవిష్యత్తులో విమానయాన సంస్థలన్నీ కూడా లగేజీ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలో అసలు లగేజీ లేకుండా ప్రయాణిస్తే… ఖర్చు తగ్గినట్టే.
- అయితే లగేజీ లేకుంటే ఎలాగన్న ఆందోళన కూడా ఉంటుంది. ప్రయాణించే చోట వీలైనంత మేరకు సౌకర్యాలను చూసుకుని… తప్పదనుకుంటే లగేజీతో ప్రయాణించాలని నిపుణులు చెబుతున్నారు.