Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

పోరాటాలకు సమయం ఆసన్నమయింది… జగన్

  • ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో జగన్ సమావేశం
  • చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న జగన్
  • చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారని వ్యాఖ్య
  • చంద్రముఖిని లేపడమంటే పులి నోట్లో తల పెట్టడమేనని ఆరోజు చెప్పానన్న జగన్
  • రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపాటు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆరు నెలలు కూడా తిరగకముందే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని… ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వంపై రాలేదని ఆయన అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నేతలతో ఈరోజు జగన్ బేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రభుత్వంపై మనమంతా పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమయిందని జగన్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీకి అనుకూలంగా మారాలంటే ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పారు. ప్రజల తరపున మనం గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. నాయకులుగా ఎదగడానికి మీకు ఇదొక అవకాశం అని చెప్పారు.

మన ప్రభుత్వ హయాంలో ప్రతి కుటుంబానికి మనం ఎంతో చేశామని జగన్ చెప్పారు. అంతకంటే ఎక్కువ చేస్తానని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికీ చంద్రబాబు హామీలు ఇచ్చారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. 

వైసీపీ హయాంలో మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేశామని జగన్ చెప్పారు. మేనిఫెస్టోకు పవిత్రతను తీసుకొచ్చామని తెలిపారు. కరోనా వచ్చినా, ప్రభుత్వ ఆదాయం తగ్గినా, ఖర్చులు పెరిగినా సాకులు చూపకుండా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేశామని చెప్పారు. తప్పుడు హామీలతో ప్రజలను చంద్రబాబు నమ్మించగలిగారని… జగన్ చేశారు కదా… చంద్రబాబు కూడా చేస్తారేమోనని ప్రజలు నమ్మారని… అందుకే మనం పరాజయం చెందామని అన్నారు. 

ఆరు నెలలు గడవకుండానే చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారని చెప్పారు. చంద్రముఖిని లేపడమంటే పులి నోట్లో తల పెట్టడమేనని ఆరోజు చెప్పానని… ఈరోజు దాన్ని చంద్రబాబు నిజం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నారని… ఇప్పుడు బిర్యానీ పోయింది, పలావు కూడా పోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలకు పథకాలు అందడం లేదని చెప్పారు. కరెంటు ఛార్జీల రూపంలో ప్రజలపై వేల కోట్ల భారాన్ని వేశారని మండిపడ్డారు. స్కామ్ ల మీద స్కామ్ లు నడుస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని చెప్పారు. 

Related posts

జగన్ పై నల్లపాడు పీఎస్ లో కేసు నమోదు!

Ram Narayana

Ram Narayana

షర్మిలతోనే తన ప్రయాణమన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి…వైసీపీలో కలవరం …

Ram Narayana

Leave a Comment