Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

అల్లు అర్జున్ వచ్చేందుకు థియేటర్ వాళ్లు దరఖాస్తు చేస్తే తిరస్కరించాం: సీపీ

  • సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీపీ ప్రెస్ మీట్
  • అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ వెళుతున్న వీడియో విడుదల
  • ఇది చూసిన తర్వాతైనా మీకు అర్థం కావడం లేదా అంటూ సీపీ వ్యాఖ్యలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. అల్లు అర్జున్ వచ్చేందుకు థియేటర్ వాళ్లు దరఖాస్తు చేస్తే తాము తిరస్కరించామని చెప్పారు. అయితే, అనుమతి లేదన్న విషయాన్ని థియేటర్ వాళ్లు అల్లు అర్జున్ కు చెప్పారో, లేదో తెలియదని అన్నారు. ఈ సందర్భంగా… అల్లు అర్జున్ పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా ప్రజలకు వాహనం పైనుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న వీడియోను కూడా సీపీ విడుదల చేశారు. ఇది చూసిన తర్వాతైనా మీకు అర్థం కావడంలేదా? అని వ్యాఖ్యానించారు.

సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకు వెళతామని చెప్పారు. తొక్కిసలాట వేళ… థియేటర్ లో ఉన్న అల్లు అర్జున్ వద్దకు వెళ్లేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు. 

ఆ రోజున విధుల్లో ఉన్న పోలీసు అధికారులతోనూ సీపీ తన ప్రెస్ మీట్లో  మాట్లాడించారు. అక్కడున్న రెండు థియేటర్లకు ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ ఉన్నందున అల్లు అర్జున్ ను రావొద్దని చెప్పామని ఓ పోలీసు అధికారి స్పష్టం చేశారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో తాను కూడా చనిపోతానేమో అనుకున్నానని వెల్లడించారు.  

తొక్కిసలాట విషయాన్ని అల్లు అర్జున్ మేనేజర్ కు తెలియజేశామని… ఓ మహిళ చనిపోయింది, బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పామని వివరించారు. కానీ, అల్లు అర్జున్ వద్దకు మేం వెళ్లేందుకు ఆ మేనజర్ ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ అక్కడ్నించి వెళ్లిపోకుంటే పరిస్థితి చేయి దాటిపోతుందని చెప్పామని, అయినప్పటికీ వినిపించుకోలేదని, సినిమా మొత్తం చూసి వెళ్లడానికే అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారని ఆరోపించారు. దాంతో, డీసీపీ వెళ్లి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారని ఆ పోలీసు అధికారి వెల్లడించారు.

ఆయన కళ్లలో పశ్చాత్తాపమే లేదు: అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై ఏసీపీ విష్ణుమూర్తి ఫైర్!

  • తీవ్ర రూపు దాల్చిన సంధ్య థియేటర్ ఘటన
  • అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం
  • నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్
  • నేడు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టిన పోలీసులు

సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం తీవ్ర రూపు దాల్చింది. పరిస్థితి చూస్తే ఇప్పుడు అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ సర్కార్ అన్నట్టుగా తయారైంది. నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయగా, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి బదులిచ్చారు. శాంతిభద్రతలకు సంబంధించిన ఈ ఘటనలో పోలీసుల ప్రస్తావన కూడా ఉండడంతో ఇప్పటికే డీజీపీ స్పందించారు. తాజాగా ఏసీపీ విష్ణుమూర్తి కూడా మీడియాతో మాట్లాడారు. 

“ఓ సినిమా యాక్టర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ఘటన ఒక యాక్సిడెంట్ అని, అందుకు ఎవరూ కారకులు కారని చెప్పారు. ఆయనపై ఎవరికీ పగ లేదు. కానీ ఆయన చేసే పనులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉన్నాయా, లేదా అనేది చూసుకోవాలి. ఆయనేమీ పాలుతాగే పిల్లవాడు కాదు… 40 ఏళ్లు పైబడిన వ్యక్తి. ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, ఎంత హుందాగా వ్యవహరించాలి? 

ఒక సెలెబ్రిటీగా ఉన్న వ్యక్తి చట్టాల గురించి, తన పరిధి గురించి తెలుసుకోవాలి? అసలు… ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టొచ్చా? ఆ అధికారం ఉందా? ఆయన రిమాండ్ ఖైదీ… బెయిల్ పై బయట ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయనకు ఉందో లేదో నాకు తెలియదు… ఆయనకే తెలియాలి. తాను, దర్శకుడు సుకుమార్, మరొకరు కలిసి కొంత మొత్తం బాధిత కుటుంబానికి ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు. ఈ చర్య పరోక్షంగా బాధితులను ప్రలోభానికి గురిచేసినట్టే అవుతుంది. 

నిన్న ఆయన కళ్లలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. ఈ పదిహేను రోజుల నుంచి సక్సెస్ మీట్ లు పెట్టుకోలేకపోతున్నాననే బాధే కనిపించింది తప్ప, ఆయనలో ఎలాంటి విచారం లేదు. ఆయన తన ఇంటిని ఒక ఫంక్షన్ హాల్ లాగా మార్చేసి, వచ్చేవాళ్లు, పోయేవాళ్లతో ఆయన చాలా హ్యాపీగా గడిపేస్తున్నాడు. 

చట్టం ఎప్పుడూ బాధితుల పక్షానే ఉంటుంది… మరి నువ్వు బాధితుడివా? ఏ రకంగా బాధితుడివి? బాగా పైసలు సంపాదించుకుని, లెక్కలు చూసుకుంటున్నావు… నీపై ఎవరైనా వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నావు” అంటూ ఏసీపీ విష్ణుమూర్తి హీరో అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Related posts

కేసీఆర్ రాసిపెట్టుకో.. ఇదే నా శపథం: రేవంత్‌రెడ్డి

Ram Narayana

అంతటి దాడి ప్రపంచంలో ఎవరిపైనా జరగలేదు: సీఎం కేసీఆర్..!

Drukpadam

సీఎం కెసిఆర్ జోలికొస్తే నీ నాలిక చీరేస్తాం..పొంగులేటిపై ఎమ్మెల్సీ మధు ఫైర్

Ram Narayana

Leave a Comment