- హైదరాబాద్ సంస్థానంలో జన్మించిన శ్యామ్ బెనగల్
- శ్యామ్ బెనగల్‌కు పేరు తెచ్చిన అంకుర్, మంథన్, జుబేదా తదితర సినిమాలు
- ఇటీవలే 90వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న శ్యామ్ బెనగల్
ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. శ్యామ్ బెనగల్ గత కొన్నిరోజులుగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. తన తండ్రి మృతి చెందారని కూతురు పియా బెనగల్ తెలిపారు.
శ్యామ్ బెనగల్‌ను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీతో, 1991లో పద్మభూషణ్‌తో సత్కరించింది. అంకుర్, మండీ, నిషాంత్, మంథన్, జుబేదా, సర్దారీ బేగం, నేతాజీ సుభాష్ చంద్రబోస్-ది ఫర్‌గాటెన్ హీరో తదితర సినిమాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. ఎనిమిది సార్లు జాతీయ అవార్డులు అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం.
శ్యామ్ బెనగల్ 1934 డిసెంబర్ 14న హైదరాబాద్ సంస్థానంలో జన్మించారు. కొంకణి మాట్లాడే చిత్రాపూర్ సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. శ్యామ్ బెనగల్ తండ్రి శ్రీధర్ బెనగల్. కర్ణాటకకు చెందిన శ్రీధర్ బెనగల్ ఫొటోగ్రాఫర్. శ్యామ్ బెనగల్‌కు సినిమాల పట్ల ఆసక్తి కలగడానికి తండ్రి కారణం. తన తండ్రి ఇచ్చిన కెమెరాతో 12 ఏళ్ల వయస్సులోనే శ్యామ్ బెనగల్ తన మొదటి చిత్రాన్ని రూపొందించారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో మాస్టర్ డిగ్రీ సంపాదించారు. హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని స్థాపించారు.
శ్యామ్ బెనగల్ పది రోజుల క్రితం… డిసెంబర్ 14న తన 90వ పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరుపుకున్నారు. ఈ వేడుకలో నటులు కుల్‌భూషణ్ ఖర్బంద, నసీరుద్దీన్ షా, దివ్యా దత్తా, షబానా అజ్మీ, రజత్ కపుర్, అతుల్ తివారి, ఫిల్మ్ మేకర్ కమ్ యాక్టర్ కునాల్ కపూర్ తదితరులు పాల్గొన్నారు.