- ఎవరూ మాట్లాడవద్దంటూ మంత్రులకు, పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
- మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో మాట్లాడకూడదని స్పష్టీకరణ
- పార్టీ నేతలు మాట్లాడకుండా చూడాలని పీసీసీకి ఆదేశాలు
- రేపు విచారణ నేపథ్యంలో లీగల్ టీంతో అల్లు అర్జున్ భేటీ
సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు, పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అల్లు అర్జున్ వ్యవహారంలో ఎవరూ ఏమీ మాట్లాడవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో కూడా అల్లు అర్జున్ వ్యవహారంపై పార్టీకి చెందిన నేతలు ఎవరూ మాట్లాడవద్దన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు మాట్లాడకుండా చూడాలని తెలంగాణ పీసీసీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు.
లీగల్ టీంతో భేటీ అయిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ తన లీగల్ టీంతో భేటీ అయ్యారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరిపేందుకు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు.
రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రేపు పోలీసుల విచారణకు సంబంధించి లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు.