3 గంటలకు పైగా అల్లు అర్జున్ విచారణ… ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్లిపోయిన నటుడు
- అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన పోలీసులు
- న్యాయవాది సమక్షంలో విచారణ జరిపిన పోలీసులు
- సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో విచారణ
సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. చిక్కడపల్లి పోలీసులు దాదాపు మూడున్నర గంటల పాటు ఆయనను విచారించారు. విచారణ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు.
అల్లు అర్జున్ ఎవరితోనూ మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు. విచారణ ముగిశాక అల్లు అర్జున్ ను పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన ఇంటికి తీసుకువెళ్లారు.
విచారణ కోసం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు.
సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్‌ను విచారించారు. ఏసీపీ రమేశ్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్, న్యాయవాదులు విచారణలో ఉన్నారు. అల్లు అర్జున్‌ను 50 వరకు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. పలు ప్రశ్నలకు ఆయన మౌనం వహించారు.
ప్రధాన నిందితుడు ఆంటోనీ అరెస్ట్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీయే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసిన పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం అతనిని థియేటర్ వద్దకు తీసుకు వెళ్లనున్నారు. ఈవెంట్లలో బౌన్సర్లకు ఆర్గనైజర్‌గా ఆంటోనీ వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఏ11 నిందితుడిగా ఉన్నారు. అతను మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు.
అయితే, పోలీసులు అడిగి ప్రశ్నల్లో కొన్ని ఇవేనంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఆ క్వశ్చన్స్ ఇవే..
1. సంధ్య థియేటర్‌కు రావడానికి పోలీసులు అనుమతి నిరాకరించారనే విషయం మీకు తెలుసా?
2. పోలీసు అనుమతి లేకపోయినా థియేటర్‌కు రావాలని మిమ్మల్ని ఎవరు పిలిచారు?
3. బయట జరిగిన తొక్కిసలాట గురించి ఏ పోలీసు అధికారైనా మీకు తెలియజేశారా?
4. మహిళ చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది?
5. థియేటర్‌కు వచ్చేటప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారు?
6. రేవతి మృతి చెందిన విషయం థియేటర్‌లో ఉన్నప్పుడే తెలిసిందా? లేదా?
7. ఓ మహిళ చనిపోయిందని, మీరు థియేటర్ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారా? లేదా?
8. ఎవరూ చెప్పలేదని మీడియా ముందు ఎందుకు చెప్పారు
9. రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా? లేదా?
10. అభిమానులు, పోలీసుల మీద దాడిచేసిన బౌన్సర్లు ఎవరు?
అల్లు అర్జున్ కు తొక్కిసలాట వీడియో చూపించిన పోలీసులు!
సంధ్య థియేటర్ ఘటనలో ఏ11గా ఉన్న హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు విచారించారు . డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏసీపీ రమేశ్, ఇన్ స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో అల్లు అర్జున్ ను ప్రశ్నించారు . కాగా, కొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానాలతో సంతృప్తి చెందని పోలీసులు… అల్లు అర్జున్ కు తొక్కిసలాట వీడియో చూపించగా, ఆయన మౌనం వహించినట్టు తెలిసింది.
ఓ ప్రశ్నకు సమాధానంగా, తాను ఓ సాధారణ ప్రేక్షకుడిలా సంధ్య థియేటర్ కు వెళ్లానని అల్లు అర్జున్ చెప్పినట్టు సమాచారం. ఇక, సంధ్య థియేటర్ కు సెలబ్రిటీల రాకపై తాము అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని కూడా పోలీసులు అల్లు అర్జున్ ముందు పెట్టగా… అందుకు కూడా ఆయన మౌనంగా ఉన్నట్టు తెలిసింది.
పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్
- చిక్కడపల్లి పీఎస్ లో బన్నీని విచారించిన పోలీసులు
- ముగిసిన విచారణ
- తమకు అందుబాటులో ఉండాలన్న పోలీసులు
- విచారణకు సహకరిస్తానన్న అల్లు అర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణ ముగిసిన అనంతరం సినీ నటుడు అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. కాగా, అవసరమైతే మరోసారి విచారణకు రావాలని బన్నీకి విచారణ అధికారులు తెలిపారు. తమకు అందుబాటులో ఉండాలని చెప్పారు. దీనికి సమాధానంగా… విచారణకు పూర్తిగా సహకరిస్తానని అల్లు అర్జున్ తెలిపారు.
విచారణ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ పోలీస్ ఎస్కార్ట్ తో పీఎస్ నుంచి ఇంటికి బయల్దేరారు. అల్లు అర్జున్ ప్రయాణించిన వాహనంలో ఆయన తండ్రి అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసు, వారి తరపు న్యాయవాది ఉన్నారు.
అల్లు అర్జున్ ఇంటి చుట్టూ తెల్లటి పరదాలు
- రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ నివాసంపై జేఏసీ నేతల దాడి
- అవాంఛిత ఘటనలు జరగకుండా పరదాలు ఏర్పాటు చేసిన అధికారులు
- లోపలి వ్యక్తులు బయటకు కనిపించకుండా తెల్లటి గుడ్డలతో ఇంటిని కప్పేసిన అధికారులు
సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటి చుట్టూ అధికారులు పరదాలను ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ నివాసం వద్ద హంగామా సృష్టించారు. జుబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంపై వారు దాడికి పాల్పడ్డారు. ఈరోజు పోలీసులు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారించారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన ఇంటికి చేరుకున్నారు.
ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు… అవాంఛిత సంఘటనలు జరగకుండా తెల్లటి పరదాలను ఏర్పాటు చేశారు. ఆయన నివాసం వద్ద… బయటి వ్యక్తులకు లోపల కనిపించకుండా తెల్లటి గుడ్డలను ఇంటి చుట్టూ కట్టారు.