- ఈ నెల 4న సంగారెడ్డి జిల్లాలో ఘటన.. తాజాగా వెలుగులోకి
- 31 వీధి కుక్కలపై అమానుషం
- 20 మృతి.. మరో 11 శునకాలకు తీవ్ర గాయాలు
- నాగోల్‌లోని వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
వీధి శునకాలపై కొందరు అమానుషంగా ప్రవర్తించారు. వాటి కాళ్లు కట్టేసి, మూతులు కుట్టేసి 40 అడుగుల బ్రిడ్జిపై నుంచి కిందపడేశారు. ఈ ఘటనలో 20 శునకాలు ప్రాణాలు కోల్పోయాయి. మరో 11 కుక్కలు తీవ్రంగా గాయపడ్డాయి. సంగారెడ్డి జిల్లాలోని ఎద్దుమైలారం శివారులో ఈ నెల 4న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు 31 వీధి కుక్కులను కాళ్లు కట్టేసి, మూతులు కుట్టేసి బ్రిడ్జిపై నుంచి కిందికి విసిరేశారు. వీటిలో 20 శునకాలు అక్కడికక్కడే మృతి చెందాయి. అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు చనిపోయిన శునకాలను చూసి వెంటనే జంతు ప్రేమికులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన శునకాలను నాగోల్‌లోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శునకాలను ఎవరైనా కావాలనే అలా పడేశారా? లేదంటే వాటిని చంపి పడేశారా? అని ఆరా తీస్తున్నారు. చనిపోయిన శునకాల నమూనాలు సేకరించి పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.