- ‘మదగజరాజ’ సినిమా ఈవెంట్‌లో వణుకుతూ కనిపించిన విశాల్
- వీడియోలు, ఫొటోలు వైరల్ కావడంతో అభిమానుల ఆందోళన
- పుకార్లు ఆగకపోవడంపై తీవ్రంగా స్పందించిన అభిమాన సంఘం
- ఇలాంటి ఫేక్ న్యూస్‌ను ప్రజలు తిరస్కరించాలని కోరిన వైనం
కోలీవుడ్ నటుడు విశాల్ ఆరోగ్యంపై హల్‌చల్ చేస్తున్న వార్తలపై ఆయన అభిమాన సంఘం ‘విశాల్ మక్కల్ నల ఇయక్కం’ తీవ్రంగా స్పందించింది. విశాల్ ఆరోగ్యంపై అధికారిక హెల్త్ బులెటిన్ విడుదలైనా పుకార్లకు తెరపడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామని, పబ్లిసిటీ కోసం మీడియా ముసుగు వేసుకుని కొందరు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించింది. నిత్యం ప్రజల గురించి ఆలోచించే తమ అభిమాన నటుడి ఆరోగ్యంపై కొందరు పనిగట్టుకుని తప్పుడు సమాచారంతో కథనాలు ప్రసారం చేస్తున్నారని, ఇలాంటి ఫేక్‌న్యూస్‌ను ప్రజలు తిరస్కరించాలని కోరింది.
చెన్నైలో ఇటీవల జరిగిన ‘మదగజరాజ’ సినిమా ఈవెంట్‌లో విశాల్ వణుకుతూ మాట్లాడటం, గుర్తుపట్టలేనంతగా ఉండటంతో అభిమానులు ఆందోళన చెందారు. ఆయనకు ఏమైందోనని ఆరా తీశారు. విశాల్ ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. తన సినిమా 11 ఏళ్ల తర్వాత విడుదల అవుతుండటంతో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా విశాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో స్పందించిన వైద్యులు విశాల్ విష జ్వరంతో బాధపడుతున్నాడని, కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని సూచిస్తూ హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. అయినా, ఆయన ఆరోగ్యంపై వార్తల ప్రవాహం ఆగకపోవడంతో ఆయన అభిమాన సంఘం ఇలా స్పందించింది.