
- త్వరలోనే రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్న కిషన్ రెడ్డి
- మండల కమిటీల్లో సగం అధ్యక్ష బాధ్యతలు బీసీలకే ఇచ్చామని వెల్లడి
- ఉచితాలు వద్దని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని వ్యాఖ్య
వారం రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడికి ఆరెస్సెస్ నేపథ్యం ఉండాలనే నిబంధన లేదని చెప్పారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని కిషన్ రెడ్డి చెప్పారు. బూత్ కమిటీలు, మండల కమిటీలు, కొత్త సభ్యత్వాలు పూర్తయ్యాయని తెలిపారు. మండల కమిటీల్లో సగానికి పైగా బీసీలకే అధ్యక్ష బాధ్యతలను అప్పగించామని చెప్పారు. పార్టీలో మహిళలకు 33 శాతం పదవులు ఇస్తామని తెలిపారు.
రేవంత్ రెడ్డి ప్రచారం చేసినంత మాత్రాన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయా? అని ప్రశ్నించారు. ఉచితాలు వద్దని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదని… రాష్ట్ర ఆదాయ వనరులు చూసుకొని పథకాలను అమలు చేయాలని చెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారమే ఏపీకి నిధులను కేటాయించామని చెప్పారు.