- భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పని గంటల విషయమై తీవ్ర చర్చ
- ఈ క్రమంలో తాజాగా యూకేలోని 200 సంస్థల్లో పర్మినెంట్‌గా 4 పని దినాల అమలు
- ఎలాంటి శాలరీ కటింగ్ కూడా వుండదు
- ‘4 డే వీక్ ఫౌండేషన్’ సర్వేలో ఈ విషయం వెల్లడైందని బ్రిటన్ మీడియా కథనాలు
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పని గంటల విషయమై తీవ్ర చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కొందరు ఎక్కువ పని గంటలు ఉండాలని చెబుతుంటే.. మరికొందరు మాత్రం పని గంటల కంటే కూడా నాణ్యమైన పని ముఖ్యం అని తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బ్రిటన్‌లోని 200 కంపెనీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి.
ఎలాంటి శాలరీ కటింగ్ లేకుండా పర్మినెంట్‌గా నాలుగు పని దినాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు పలు మార్కెటింగ్, టెక్నాలజీ, ఛారిటీలు సహా 200 సంస్థలు ఈ విధానంలోకి మారినట్లు యూకే మీడియా కథనాలు పేర్కొన్నాయి. ‘4 డే వీక్ ఫౌండేషన్’ చేసిన సర్వేలో భాగంగా ఈ విషయం వెల్లడైందని ఆ కథనాలు వెల్లడించాయి. కాగా, ఈ నిర్ణయంతో ఆయా కంపెనీలలో పని చేస్తున్న సుమారు 5 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని తెలిపాయి.
ఈ సందర్భంగా ‘4 డే వీక్ ఫౌండేషన్’ డైరెక్టర్ జో రైల్ మాట్లాడుతూ… “వారానికి ఐదు రోజుల పని దినాలు, 9 నుంచి 5 వరకు జాబ్ అనేవి వందేళ్ల కిందటి విధానాలు. ప్రస్తుత అవసరాలకు ఇవి సరిపోవు. మనం అప్‌డేట్ కావాల్సిన అవసరం ఉంది. వారానికి 4 రోజుల పని దినాలతో ఉద్యోగులకు ఎక్కువ ఖాళీ సమయం దొరుకుతుంది. దానివల్ల వారికి ఫ్యామిలీతో సంతృప్తికర జీవితాన్ని గడపడానికి స్వేచ్ఛ లభిస్తుంది” అని చెప్పారు.
కాగా, వారానికి 4 రోజుల పని దినాలను మొదట యూకేలోని సుమారు 30 మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, మీడియా సంబంధిత సంస్థలు అమలు చేశాయి. ఇప్పుడు 24 ఐటీ, టెక్నాలజీ, 29 ఛారిటీలు, 22 మేనేజ్‌మెంట్, కన్సల్టింగ్ కంపెనీలు కూడా ఇదే విధానంలో చేరినట్లు తాజాగా సర్వేలో వెల్లడైంది. ఇక బ్రిటన్ రాజధాని లండన్‌లో అత్యధికంగా 59 సంస్థలు ఈ కొత్త పని విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిసింది.