- ఫేక్ ఐడీ కార్డుతో హడావుడి చేసిన భాస్కర్ రావు, రవి
- అధికారులతో పనులు చేయిస్తామంటూ దందాలు
- రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భద్రతా సిబ్బంది
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నకిలీ ఉద్యోగులు దర్జాగా తిరగడం కలకలం రేపింది. ఫేక్ ఐడీ కార్డు మెడలో వేసుకుని అన్ని సెక్షన్లు తిరుగుతూ హల్చల్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్రటేరియట్ లో ఇటీవల నకిలీ ఉద్యోగులు తిరుగుతున్నారని భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. దీంతో నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ శాఖ.. మంగళవారం ఇద్దరు నకిలీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ రావు, డ్రైవర్ రవి ఫేక్ ఐడీ కార్డులు తయారుచేసి సెక్రటేరియట్ లో దందా చేస్తున్నారు.
సెక్షన్ ఆఫీసుల్లో తిరుగుతూ అక్కడికి వచ్చిన వారిని మాటల్లో పెట్టి వివరాలు రాబడుతున్నారు. వారి పని పూర్తిచేయిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నారు. నకిలీ ఉద్యోగుల సమాచారంతో అప్రమత్తమైన సచివాలయ భద్రతా సిబ్బంది, ఇంటెలిజెన్స్ శాఖ అధికారులు నిఘా పెట్టారు. ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు చాకచాక్యంగా వ్యవహరించి నకిలీ ఉద్యోగులు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరినీ సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ గా చలామణి అవుతున్న భాస్కర్ రావుతో పాటు డ్రైవర్ రవిని పోలీసులు విచారిస్తున్నారు.