- రోజూ గ్రీన్ టీ తాగితే మంచి ఆరోగ్యానికి మార్గం
- అందులో దాల్చిన చెక్క పొడి, నెయ్యి కలుపుకొంటే మరింత లాభం అంటున్న నిపుణులు
- ముఖ్యంగా బరువు తగ్గాలకునేవారికి ప్రయోజనకరమని వెల్లడి
ఆరోగ్యానికి మంచిదంటూ గ్రీన్ టీ తాగేవారి సంఖ్య ఈ మధ్య బాగా పెరిగింది. ఇది వాస్తవమే. అయితే సాధారణ గ్రీన్ టీ మాత్రమేగాకుండా అందులో కొంత దాల్చిన చెక్క పొడి, ఒక చెంచాడు నెయ్యి కలుపుకొని తాగితే మరికొన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఫలితం ఇస్తుందని అంటున్నారు.
నెయ్యి కలిపితే లాభమేమిటి?
- మనం వాడే నెయ్యి కేవలం ఆహారం మాత్రమేకాదు… ఆయుర్వేదపరంగా ఒక ఔషధం కూడా అని నిపుణులు చెబుతున్నారు.
- దీనిలో విటమిన్ ఏ, డి, ఈ, కె వంటివి సమృద్ధిగా ఉంటాయని… ఇవన్నీ కొవ్వులో కరిగే విటమిన్లు కావడం వల్ల నెయ్యి తీసుకుంటే శరీరం సులువుగా సంగ్రహించ గలుగుతుందని వివరిస్తున్నారు. ఇదే సమయంలో గ్రీన్ టీలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా శరీరానికి సమర్థవంతంగా అందేందుకు నెయ్యి వీలు కల్పిస్తుందని స్పష్టం చేస్తున్నారు.
- నెయ్యిలో ఉండే బ్యూటైరేట్ అనే ఫ్యాటీ యాసిడ్ మన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడేందుకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పేగుల లోపలి గోడలను మరమ్మతు చేసి, ఆరోగ్యకర బ్యాక్టీరియా పెరిగేందుకు నెయ్యి మార్గం సుగమం చేస్తుందని వివరిస్తున్నారు.
- నెయ్యిలోని బ్యూటైరేట్ కు యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయని, ఇవి గ్రీన్ టీలో ఉండే కెటచిన్లుగా పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు సమర్థవంతంగా పనిచేయడానికి తోడ్పడుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
దాల్చిన చెక్క కలిపితే వచ్చే ప్రయోజనమేమిటి?
- ఆయుర్వేదం ప్రకారం దాల్చిన చెక్క కూడా అద్భుతమైన ఔషధ లక్షణాలు ఉన్నదే. దీనితో ఎన్నోరకాల ప్రయోజనాలు ఉన్నాయని, అందులోనూ గ్రీన్ టీతో కలిపి తీసుకోవడం వల్ల మరింత లాభమని నిపుణులు చెబుతున్నారు.
- దాల్చిన చెక్కలో ఫ్లేవనాయిడ్లు, పాలిఫెనాల్స్ గా పిలిచే రసాయన సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయని… ఇవి గ్రీన్ టీతో కలసి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
- గ్రీన్ టీ, నెయ్యి తరహాలోనే దాల్చిన చెక్క కూడా శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించేందుకు దోహదం చేస్తుందని.. ముఖ్యంగా ఇందులోని సిన్నమాల్డిహైడ్ శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు.
- దాల్చిన చెక్క మన శరీరంలో ఇన్సూలిన్ సెన్సిటివిటీని పెంచి, షుగర్ స్థాయులను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మధుమేహాన్ని నియంత్రించి, శరీరంలో శక్తి స్థాయులను స్థిరంగా ఉంచడానికి ఇది దోహదం చేస్తుందని వివరిస్తున్నారు.
మూడింటినీ కలిపితే… మూడింతల ప్రయోజనం
గ్రీన్ టీ, నెయ్యి, దాల్చిన చెక్క మూడింటినీ కలిపితే… మూడింతల ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించడంతోపాటు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారికి మంచి ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు.