- గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ కు వచ్చిన దొంగ
- పట్టుకునేందుకు పోలీసుల యత్నం
- రెండు రౌండ్లు కాల్పులు జరిపిన దొంగ
- దొంగను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ గా గుర్తింపు
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో నేడు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ దొంగ పోలీసులపై కాల్పులు జరిపాడు. దొంగ గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ కు వచ్చాడన్న సమాచారంతో పోలీసులు అతడిని పట్టుకునేందుకు వచ్చారు. పోలీసులను గమనించిన దొంగ వారిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ వెంకట్రామ్ రెడ్డికి, ఓ బౌన్సర్ కు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఎట్టకేలకు పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఆ దొంగను పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ గా గుర్తించారు. అతడిపై పలు కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు. కాగా, గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ ను, బౌన్సర్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.