Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

న్యాక్ రేటింగ్ కోసం లంచాలు.. గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీ, న్యాక్ అధికారుల అరెస్ట్!

  • న్యాక్ రేటింగ్ ‘ఎ++’ కోసం న్యాక్ బృందానికి కేఎల్‌యూ లంచాలు
  • కేఎల్‌యూతో న్యాక్ పర్యవేక్షక బృందం సభ్యుల కుమ్మక్కు
  • పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్న అధికారులు
  • విజయవాడ, చెన్నై సహా దేశవ్యాప్తంగా 20 చోట్ల సీబీఐ సోదాలు
  • పెద్ద ఎత్తున నగదు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, బంగారం స్వాధీనం
  • కేఎల్‌ఈఎఫ్‌కు చెందిన 14 మందిపై ఎఫ్ఐఆర్ 

న్యాక్ రేటింగ్ కోసం అక్రమాలకు పాల్పడిన కేఎల్ యూనివర్సిటీ అధికారులతోపాటు న్యాక్ పర్యవేక్షక బృందం సభ్యులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కేఎల్ఈఎఫ్)కు చెందిన అధికారులతోపాటు న్యాక్ ఇన్‌స్పెక్షన్ టీం సభ్యులతో కలిపి మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నట్టు దర్యాప్తు సంస్థ తెలిపింది. న్యాక్ అక్రెడిటేషన్ ‘ఎ++’ కోసం కేఎల్‌యూ అధికారుల నుంచి న్యాక్ సభ్యులు ముడుపులు తీసుకున్న కేసులో వీరు అరెస్ట్ అయ్యారు. 

కేఎల్ఈఎఫ్ ఆఫీస్ బేరర్లతోపాటు న్యాక్ ఇన్‌స్పెక్షన్ టీం సభ్యులపై కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటన తర్వాత చెన్నై, బెంగళూరు, విజయవాడ, పాలము, సంబల్‌పూర్, భోపాల్, బిలాస్‌పూర్, గౌతంబుద్ధ నగర్, న్యూఢిల్లీ సహా మొత్తం 20 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా అక్రెడిటేషన్ కోసం అధికారులకు ముట్టజెప్పినట్టుగా చెబుతున్న నగదు, బంగారం, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు. 

సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో దాదాపు రూ. 37 లక్షల నగదు, 6 లెనోవో ల్యాప్‌టాప్‌లు, ఒక ఐఫోన్ 16 ప్రో మొబైల్ ఫోన్, ఒక బంగారు నాణెం, అమెరికన్ టూరిస్టర్ ట్రాలీ బ్యాగులు ఉన్నాయి. ఇక, అరెస్ట్ అయిన వారిలో కేఎల్ఈఎఫ్‌ వైస్ చాన్స్‌లర్ జీపీ సారథి వర్మ,  వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా హరీన్, కేఎల్‌యూ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ ఉన్నారు. వీరితోపాటు ఆరుగురు న్యాక్ పర్యవేక్షణ బృందం సభ్యులు కూడా ఉన్నారు. అలాగే, న్యాక్ సీనియర్ అధికారులు, కేఎల్ఈఎఫ్‌కు చెందిన 14 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దర్యాప్తు కొనసాగుతోందని, దాడుల అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని సీబీఐ అధికారులు తెలిపారు. తాజా, ఘటన నేపథ్యంలో న్యాక్ అక్రెడిటేషన్ ప్రక్రియపై అనుమానాలు తలెత్తుతున్నాయి. 

Related posts

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపుపై కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

ఫార్ములా ఈ రేసింగ్ కేసు.. గ్రీన్ కో ఆఫీసులో ఏసీబీ సోదాలు!

Ram Narayana

వక్క పంట రైతన్నల ఇంట “సిరుల” పంట

Ram Narayana

Leave a Comment