- రామమందిరానికి ప్రధాన పూజారిగా వ్యవహరిస్తున్న సత్యేంద్ర దాస్
- బీపీ, షుగర్ తో బాధపడుతున్న వైనం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా బ్రెయిన్ స్ట్రోక్
- చికిత్సకు స్పందిస్తున్నారన్న వైద్యులు
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
సత్యేంద్ర దాస్ వయసు 85 సంవత్సరాలు. 1992లో రామ జన్మభూమి వద్ద బాబ్రీ మసీదును కూల్చివేసిన తర్వాత, తాత్కాలిక రామ మందిరానికి పూజారిగా వ్యవహరించారు. ఇటీవల అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలోనూ సత్యేంద్ర దాస్ ప్రముఖ పాత్ర వహించారు. ప్రస్తుతం రామ మందిరానికి ఆయనే ప్రధాన పూజారి.
కొన్నాళ్లుగా షుగర్, బీపీతో బాధపడుతున్న ఆయన నిన్న (ఫిబ్రవరి 2) లక్నోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. అయితే తమ చికిత్సకు సత్యేంద్ర దాస్ స్పందిస్తున్నారని డాక్టర్లు వెల్లడించారు.