హైదరాబాద్‌లో వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడ తరలింపు…
2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి
వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు
వల్లభనేని వంశీపై కిడ్నాప్ కేసు.. ఎస్సీ, ఎస్టీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు
కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసినట్టు కేసు నమోదు
వంశీపై ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ బంధువులు
గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని ‘మై హోం భుజా’లో ఉన్న ఆయనను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా విజయవాడ తరలించారు ..
గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20న దాడి జరిగింది. ఈ కేసులో వంశీ సహా 88 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ కోర్టులో వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ జరగనుంది. అంతలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు. మొత్తం 7 సెక్షన్ల కింద కేసు నమోదయింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిపై పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఆయన హాజరై ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. రెండు రోజుల క్రితం వల్లభనేని వంశీకి చెందిన అనుచరులు సత్యవర్ధన్ ను కోర్టుకు కారులో తీసుకొచ్చారు. అనంతరం కోర్టు నుంచి నేరుగా వెళ్లి వంశీని సత్యవర్ధన్ కలిశారు. ఆ తర్వాత సత్యవర్ధన్ ను వంశీ విశాఖకు పంపించారు.
ఈ క్రమంలో సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి, బెదిరించారని ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, సత్యవర్ధన్ ను పోలీసులు విచారించగా… కేసు విత్ డ్రా చేసుకోవాలని తనను కిడ్నాప్ చేసి బెదిరించారని తెలిపారు. ఈ క్రమంలో వల్లభనేని వంశీ ఆయన అనుచరులపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: