- సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా నియామకం సరికాదన్న రాహుల్ గాంధీ
- అర్ధరాత్రి సమయంలో నిర్ణయం తీసుకున్నారని విమర్శ
- సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారన్న రాహుల్ గాంధీ
భారత ఎన్నికల సంఘం నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ ఎంపికపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా నియామకం సరికాదని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అర్ధరాత్రి సమయంలో నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు.
ఎన్నికల కమిషనర్ ఎంపికకు సంబంధించి కమిటీ సమావేశంలో అభ్యంతరాల నివేదికను మోదీ, అమిత్ షాలకు అందించామని రాసుకొచ్చారు. కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం లేని స్వతంత్ర ఎన్నికల కమిషన్‌లో అత్యంత ప్రాథమిక అంశం ఎన్నికల సంఘం కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియ అని తెలిపారు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అర్ధరాత్రి సమయంలో నూతన సీఈసీని ఎంపిక చేశారని విమర్శించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంపై సుప్రీంకోర్టులో 48 గంటల్లో విచారణ జరగనుందని, ఈ క్రమంలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని పేర్కొన్నారు.