Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం..

 త్వరలో రైతు సాధికార సంస్ధతో కీలక ఒప్పందం!

  • ఏపికి వచ్చిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు
  • ముఖ్యమంత్రి చంద్రబాబుతో సచివాలయంలో సమావేశం
  • సాగు, ఉత్పత్తి, సాకేంతికత, మార్కెటింగ్ వంటి అంశాల్లో సాయం 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల దావోస్ పర్యటనలో పలు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను వివరించి ప్రకృతి వ్యవసాయంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో నాడు చంద్రబాబుతో భేటీ అయిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు బుధవారం ఏపీకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఛైర్మన్ క్రేయిగ్ కోగుట్, ఆపరేటింగ్ అడ్వైజర్ గినా మెగ్‌కార్తీ, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సీఈవో కీత్ అగోడా ముఖ్యమంత్రితో సచివాలయంలో భేటీ అయ్యారు. దావోస్ సమావేశానికి కంటిన్యూ మీటింగ్‌గా జరిగిన ఈ సమావేశంలో రానున్న రోజుల్లో కలిసి పనిచేసే అంశాలపై చర్చించారు. 

ప్రకృతి వ్యవసాయం, భిన్నమైన వాతావరణాన్ని తట్టుకోగల పంటలను అందించడం, రైతు నుండి వినియోగదారు వరకు ఎండ్-టు-ఎండ్ అనుసంధాన వ్యవస్థను రూపొందించడం, మార్కెట్ డెవలప్‌మెంట్, ఫైనాన్సింగ్, డేటా మేనేజ్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంపై ఈ సంస్థలు సహాయపడనున్నాయి. పబ్లిక్, ప్రైవేట్ సంస్థల నుంచి ఆర్థిక సాయాన్ని అందించేందుకు సహకారాన్నిస్తాయి. ప్రకృతి వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ కోసం ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రమోట్ చేస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన రైతు సాధికార సంస్థతో పెగాసస్ క్యాపిటల్ అడ్వజైర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థలు ఎంఓయూ చేసుకోనున్నాయి. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అవకాశాలను, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను, ప్రస్తుత పరిస్థితులను ఆ సంస్థల ప్రతినిధులకు వివరించారు. ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయని….ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోందని అన్నారు. తాము తీసుకునే ఆహారంపై వారు అవగాహన కోరుకుంటున్నారన్నారు. రానున్న రోజుల్లో ఆహార ఉత్పత్తుల సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ అనేది కీలకం కానుందని అన్నారు. ఆ దిశగా తాము రైతులను, ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రకృతి సేద్యం తన కల అని చెప్పిన సిఎం….రైతుల్లో చైతన్యం తెచ్చి అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సహకరించాల్సిందిగా ఆ సంస్థల ప్రతినిధులను కోరారు.

Related posts

How VR-Like Immersive Experiences Can Be Produced For Real

Drukpadam

తిరుమల క్యూలైన్‌లో ఫ్రాంక్ వీడియో… విజిలెన్స్ విచారణకు ఆదేశించిన టీటీడీ

Ram Narayana

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై పెద్ద ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం!

Drukpadam

Leave a Comment