Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆరోగ్యం

తేనె, వెల్లుల్లి కలిపి తినొచ్చా… అలా తీసుకుంటే ఏమవుతుందంటే?

  • మన శరీరానికి మేలు చేసే ఆహారంలో తేనె, వెల్లుల్లి కీలకం
  • రెండింటితోనూ వేర్వేరుగా ఎన్నో రకాల ప్రయోజనాలు
  • కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందనే దానిపై నిపుణుల సూచనలివీ…

తేనె, వెల్లుల్లి రెండూ కూడా భారతీయుల ఆహారంలో కీలకమైనవే. ఈ రెండింటితోనూ ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన సంపూర్ణ ఆరోగ్యానికి తేనె, వెల్లుల్లి దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం ప్రమాదకరం ఏమీ కాదని… కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా ఉంటాయని వివరిస్తున్నారు. 

బరువు తగ్గేందుకు మంచి మార్గం…
వెల్లుల్లి, తేనె కలిపి తీసుకుంటే… బరువు తగ్గేందుకు బాగా దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రెండింటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇన్ ఫ్లమేషన్ తగ్గిస్తాయని వివరిస్తున్నారు. వెల్లుల్లి రక్తంలో షుగర్ స్థాయులను సమర్థవంతంగా నియంత్రిస్తుందని, దీనితో కొవ్వు పెరగకుండా ఉంటుందని చెబుతున్నారు. చక్కెరకు బదులుగా తేనెను వినియోగిండం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఇక రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుందని… జీవక్రియల వేగం పెంచి కొవ్వు కరిగేందుకు వీలవుతుందని నిపుణులు వివరిస్తున్నారు.

అద్భుతమై రోగ నిరోధక శక్తి…
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సల్ఫర్ రసాయన సమ్మేళనానికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మన శరీరం సూక్ష్మజీవులతో, ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో బాగా సహాయపడతాయి. మరోవైపు తేనెలో సహజమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గాయాలు మానడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తోడ్పడతాయి. ఇలాంటి వెల్లుల్లి, తేనె రెండూ కలిపి తీసుకుంటే.. మన శరీరంలో రోగ నిరోధక శక్తి అద్భుతంగా బలోపేతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్లకు ఇవి మంచి ఉపశమనం ఇస్తాయని వివరిస్తున్నారు.

గుండెకు మంచి ఆరోగ్యం…
గుండె ఆరోగ్యానికి సంబంధించి వెల్లుల్లి అద్భుతమైన ఔషధంగా చెప్పవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులను, రక్తపోటును తగ్గించడంలో… శరీరంలో రక్త సరఫరాను మెరుగుపర్చడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. అదే సమయంలో రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా చూస్తుంది. మొత్తంగా గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇదే సమయంలో తేనె మన శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. వెల్లుల్లి, తేనె రెండింటినీ కలిపి తీసుకుంటే… గుండె వ్యాధులకు, అధిక కొలెస్ట్రాల్ కు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణ వ్యవస్థ బలోపేతం…
వెల్లుల్లి, తేనె రెండూ కూడా మన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రేరేపించడం, మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు తోడ్పడటం ద్వారా వెల్లుల్లి జీర్ణ శక్తిని పెంచుతుందని… గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుందని వెల్లడిస్తున్నారు. మరోవైపు తేనె జీర్ణాశయంలో అల్సర్లను, ఎసిడిటీని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాకుండా జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా ఎదిగేందుకు తేనె ఆహారంగా పనిచేస్తుందని వివరిస్తున్నారు. అందువల్ల తేనె, వెల్లుల్లి కలిపి తీసుకోవడం వల్ల మొత్తంగా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందని స్పష్టం చేస్తున్నారు.

మంచి కాంతివంతమైన, నిగారించే చర్మం
మన చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండేందుకు వెల్లుల్లి, తేనె అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఆయుర్వేదంలోనూ వినియోగిస్తారని గుర్తు చేస్తున్నారు. వెల్లుల్లిలోని యాంటీ మైక్రోబియల్ లక్షణాలు… మొటిమలు, ఇతర చర్మ సమస్యలను, ఇన్ఫెక్షన్లను నిర్మూలిస్తాయని వివరిస్తున్నారు. తేనె కూడా మొటిమల నివారణకు, చర్మం నిగారింపునకు దోహదం చేస్తుందని చెబుతున్నారు. రెండింటినీ కలిపి తీసుకుంటే.. మన చర్మం లోపలి నుంచి కాంతివంతంగా మారుతుందని వివరిస్తున్నారు.

వెల్లుల్లి, తేనె కలిపితే మరెన్నో లాభాలు…

  • వెల్లుల్లి, తేనె రెండూ కూడా శరీరం నుంచి విష పదార్థాలు, వ్యర్థాలను బయటికి పంపించడంలో సాయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వెల్లుల్లి మన కాలేయాన్ని శుభ్రం చేస్తుందని వివరిస్తున్నారు.
  • ఈ రెండూ కూడా దగ్గు, బ్రాంకైటిస్, ఆస్తమా వంటి సమస్యలను తగ్గించి… శ్వాస వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. జలుబు, ఇతర అలర్జీల నుంచి కూడా ఉపశమనం ఉంటుందని చెబుతున్నారు.

వెల్లుల్లి, తేనె ఎలా కలిపి వాడాలి?

  • రెండు మూడు వెల్లుల్లి రేకలను దంచి, ఒక టేబుల్ స్పూన్ తేనెలో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలని… సుమారు 15 నిమిషాల నుంచి అరగంట తర్వాత తినేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా రోజూ ఒకసారి చేయడం వల్ల దీర్ఘకాలికంగా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని వివరిస్తున్నారు.
  • రెండు, మూడు వెల్లుల్లి రేకలను దంచి, వేడి నీటిలో ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత వెల్లుల్లిని వడగట్టి… ఆ నీటిలో ఒక చెంచాడు తేనె కలుపుకొని తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇది గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలను వేగంగా తగ్గిస్తుందని వివరిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి…
వెల్లుల్లి, తేనె రెండూ ఆరోగ్యానికి మంచివే అయినా… కొందరు వ్యక్తులకు, ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి వారు వైద్యులను సంప్రదించిన తర్వాత వెల్లుల్లి, తేనె వంటి వాటిని వాడటం, ఆహారంలో మార్పులు చేసుకోవడం చేయాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తేనె విషయంలో మధుమేహం ఉన్నవారు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Related posts

రోజూ పొద్దున్నే నెయ్యిని ఇలా వాడితే… వేగంగా బరువు తగ్గొచ్చు!

Ram Narayana

దయచేసి.. ఉదయాన్నే ఈ టిఫిన్ల జోలికి వెళ్లకండి!

Ram Narayana

అవి అనారోగ్య సమస్యలు కావు.. ఈ అపోహలు మీకూ ఉన్నాయా?

Ram Narayana

Leave a Comment