- బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఘటన
- హోటల్ టెర్రస్‌పైకి తీసుకెళ్లి అఘాయిత్యం
- ఆపై దోచుకుని పరార్.. ముగ్గురి అరెస్ట్
కర్ణాటక రాజధాని బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై నలుగురు వ్యక్తులు హోటల్ టెర్రస్‌పై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం మధ్య ఈ ఘటన జరిగింది. అఘాయిత్యం తర్వాత ఆమెను దోచుకుని నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులలో ఒకరు ఆమెకు పరిచయస్తుడే కావడం గమనార్హం.
బాధితురాలు ఎమర్జెన్సీ నంబర్ 112కు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్‌కు చెందిన ముగ్గురు నిందితులు అజిత్, విశ్వాస్, శివులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నిందితులు హెచ్ఎస్ఆర్ లే అవుట్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఢిల్లీకి చెందిన బాధితురాలు పెళ్లి చేసుకుని నగరంలోనే ఉంటోంది. స్నేహితుడిని కలిసేందుకు గురువారం హోటల్‌కు వెళ్లింది. ఈ క్రమంలో నిందితులు ఆమెను నమ్మించి హోటల్ టెర్రస్‌పైకి తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను దోచుకుని పరారైనట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఆమె స్నేహితుడే ఆమెను హోటల్‌కు రప్పించినట్టు తెలిసింది.