Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

యూట్యూబర్ కు నాలుగు నిమిషాల్లో ఓకే చెప్పిన సత్య నాదెళ్ల!

  • క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ తో సంచలనం సృష్టించిన సత్య నాదెళ్ల
  • ఏఐని మించిపోయే టెక్నాలజీతో మైక్రోసాఫ్ట్ ను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం
  • ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొనేందుకు పెద్దగా ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్న వైనం

బిల్ గేట్స్ మానస పుత్రిక, టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన మైక్రోసాఫ్ట్ సంస్థ… సీఈవోగా సత్య నాదెళ్ల వచ్చాక టెక్నాలజీ పరంగా కొత్త పుంతలు తొక్కుతోంది. అందరూ ఏఐ గురించి మాట్లాడుకుంటున్న సమయంలో… సత్యనాదెళ్ల నాయకత్వంలోని మైక్రోసాఫ్ట్ మరింత ముందుకు వెళ్లి ‘క్వాంటమ్ కంప్యూటింగ్’ లో కీలక మైలురాయిని నమోదు చేసింది. క్వాంటమ్ కంప్యూటింగ్ కు గుండెకాయ వంటి ‘గాడ్ చిప్’ ను సత్య నాదెళ్ల ఆవిష్కరించడం టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. 

ఇక అసలు విషయానికొస్తే… మైక్రోసాఫ్ట్ సంస్థ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ ను ఆవిష్కరించిన అనంతరం సత్య నాదెళ్ల ఓ పాడ్ కాస్ట్ కు హాజరయ్యారు. ఈ పాడ్ కాస్ట్ ను ద్వారకేశ్ పటేల్ అనే భారత సంతతి యూట్యూబర్ నిర్వహించాడు. ఈ పాడ్ కాస్ట్ కు హాజరయ్యే ముందు, సదరు యూట్యూబర్ పంపిన ఓ సాధారణ ఈమెయిల్ కు సత్య నాదెళ్ల వెంటనే స్పందించడం విశేషం. 

ద్వారకేశ్ పటేల్ గతంలో తన యూట్యూబ్ చానల్లో మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వంటి వారితోనూ పాడ్ కాస్ట్ లు నిర్వహించాడు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన న్యూస్ లెటర్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోవడాన్ని పటేల్ గుర్తించాడు. దాంతో, ఆయనను కూడా పాడ్ కాస్ట్ కు ఆహ్వానిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. వెంటనే… ఓ మామూలు ఈ-మెయిల్ పంపాడు. 

“హాయ్ సత్యా… నా న్యూస్ లెటర్ సబ్ స్క్రయిబర్ లిస్టులో మీ ఈ-మెయిల్ ఐడీని చూశాను. మీరు మా పట్ల ఆకర్షితులు కావడం సంతోషదాయకం. నేను నిర్వహించే పాడ్ కాస్ట్ కు రావడం మీకు సమ్మతమేనా? ఏఐ గురించి, మైక్రోసాఫ్ట్ గురించి మీ ద్వారా వినాలనుకుంటున్నాను. వచ్చే పాతికేళ్లలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో పాడ్ కాస్ట్ ద్వారా అందరికీ తెలియజేస్తారని ఆశిస్తున్నాను” అంటూ ద్వారకేశ్ పటేల్ తన ఈ-మెయిల్ లో పేర్కొన్నాడు. 

అయితే పటేల్ ను సర్ ప్రైజ్ చేస్తూ… సత్య నాదెళ్ల కేవలం 4 నిమిషాల్లోనే అతడి ఈ-మెయిల్ కు బదులిచ్చారు. తాను పాడ్ కాస్ట్ కు వస్తున్నానంటూ రిప్లయ్ ఇచ్చారు. నువ్వు నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ లు సూపర్ గా ఉంటున్నాయి… నాకు బాగా నచ్చాయి అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఈ విషయాన్ని యూట్యూబర్ పటేల్ ఎక్స్ ద్వారా వెల్లడించడంతో అందరికీ తెలిసింది.

Related posts

200 మంది ప్రయాణికులతో వెళ్తూ గ్రీన్‌లాండ్ మారుమూల ప్రాంతంలో చిక్కుకుపోయిన విలాసవంతమైన నౌక

Ram Narayana

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు భార‌త సంతతి వ్యక్తుల దుర్మ‌ర‌ణం!

Ram Narayana

ఇమ్రాన్‌ఖాన్‌పై ‘నేరపూరిత కుట్ర’ అభియోగం.. తేలితే మరణశిక్షే!

Ram Narayana

Leave a Comment