- భూమిని ఢీ కొట్టే అవకాశం దాదాపు శూన్యమే అంటున్న ఈఎస్ఏ
- 2024 వైఆర్ 4 గ్రహశకలం కదలికలను పరిశీలించిన స్పేస్ ఏజెన్సీ
- తొలుత ముప్పు ఎక్కువని చెప్పిన నాసా.. తాజాగా హెచ్చరికలు వాపస్
అంతరిక్షంలో సూర్యుడి చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతున్న ఓ గ్రహశకలం 2032లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని అంతరిక్ష పరిశోధనా సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. 2024 డిసెంబర్ 27న ఈ గ్రహశకలాన్ని చిలీ పరిశోధకులు గుర్తించారు. సూర్యుడి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న ఈ గ్రహశకలం వేగంగా భూమివైపు దూసుకొస్తోందని తెలిపారు. ఈ నెల 18న నాసా జరిపిన పరిశీలనలో 2024 వైఆర్ 4 గ్రహశకలం భూమిని ఢీ కొట్టేందుకు 3.1 శాతం అవకాశం ఉందని తేలింది. దీంతో ఈ గ్రహశకలాన్ని లెవెల్ -3 శకలంగా నాసా ప్రకటించింది. అయితే, ఈ గ్రహశకలంతో ఎలాంటి ముప్పు లేదని ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) నిర్ధారించింది.
ఈ నెల 19న జరిపిన పరిశోధనలో ముప్పు శాతం 1.5 శాతంగా తేలిందని, ఈ నెల 24న జరిపిన పరిశోధనలో ముప్పు శాతం 0.002 శాతానికి తగ్గిందని నాసా కూడా వెల్లడించింది. దీంతో ఈ గ్రహశకలంతో భూమికి ముప్పు లేదని తేల్చి హెచ్చరికలను ఉపసంహరించుకుంది. అయితే, ఈ గ్రహశకలంపై నిఘా కొనసాగిస్తామని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దీని పరిమాణం, లోపలి మూలకాల వివరాల గురించి పరిశోధన జరుపుతామని చెప్పారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపుతో ఈ గ్రహశకలాన్ని మార్చి, మే నెలల్లో పరిశీలించనున్నట్లు తెలిపారు. 2024 వైఆర్ 4 వ్యాసం సుమారు 50 మీటర్లు ఉండవచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కాగా, సూర్యుడి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరగడం వల్ల ఈ గ్రహశకలం కొన్నాళ్లపాటు కనిపించదని, 2028 జూన్ లో మళ్లీ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.