- మనుషుల తీరులో ఎన్నో రకాలు
- కొందరిలో తరచూ ఉక్కపోత, మరికొందరిలో చలి ఫీలింగ్
- ఎప్పుడూ చలిగా అనిపించడం వెనుక కారణాలేమిటో చెబుతున్న నిపుణులు
కొందరు ఎప్పుడు చూసినా వేడి, ఉక్కపోత అంటుంటారు. వారు చలిని బాగా తట్టుకుంటారు. మరికొందరు ఎప్పుడూ చలిగా అనిపిస్తుందని అంటారు. వాతావరణం, పరిసరాలు ఏ మాత్రం చల్లగా ఉన్నా భరించలేరు. ఇది వారి అలవాట్లను బట్టి ఉంటుందని అనుకుంటూ ఉంటాం. కానీ దీని వెనుక శారీరక, అనారోగ్య కారణాలు ఉంటుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ చల్లగా అనిపించడానికి కారణాలేమిటో వివరిస్తున్నారు.
శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేకపోవడం…
మన శరీరంలో రక్త ప్రసరణ సరిగా ఉంటేనే… శరీరమంతా వేడి సమ స్థితిలో, వెచ్చగా ఉంటుంది. అదే రక్త ప్రసరణ సరిగా లేకుంటే… ముఖ్యంగా కాళ్లు, చేతుల వద్ద రక్త సరఫరా సరిగా లేకుంటే… ఎప్పుడూ చలి వేస్తున్న అనుభూతి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బుల కారణంగా మరియూ రేనాడ్స్ డిసీజ్ వంటివి రక్త సరఫరా సరిగా లేకపోవడానికి కారణం కావొచ్చని పేర్కొంటున్నారు. ఎవరైనా కదలకుండా ఎక్కువసేపు ఒకేచోట కూర్చుండిపోవడం వల్ల కూడా రక్త సరఫరా వేగం తగ్గిపోయి చలిగా అనిపిస్తుందని వివరిస్తున్నారు.
ఐరన్ లోపం… ఎనీమియా…
శరీరంలో ఆక్సిజన్ సరఫరా కోసం ఐరన్ అత్యంత కీలకం. మన ఎర్రరక్త కణాల్లోని హెమోగ్లోబిన్ లో ఉండే ఐరన్… శరీర కణాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. దానివల్ల శరీరంలో జీవక్రియలు సరిగా జరిగి వెచ్చగా ఉంటుంది. ఇలాంటి ఐరన్ లోపించినా, ఇతర సమస్యలతోగానీ, ఎనీమియా (రక్త హీనత) సమస్య వచ్చినా… వారిలో తరచూ చలి వేస్తుంటుంది. వాతావరణ ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నా కూడా ఇలాంటి వారు చలిగా వుందని చెబుతూ ఉంటారు. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
థైరాయిడ్ సమస్యలు
మన శరీరంలో జీవక్రియలను నియంత్రించే కీలకమైన హార్మోన్లను విడుదల చేసేది థైరాయిడ్ గ్రంథి. ఈ గ్రంథి పనితీరు దెబ్బతింటే… హైపోథైరాయిడిజమ్ సమస్య తలెత్తి, జీవక్రియల తీరు మందగిస్తుంది. దీనితో శరీరంలో వేడి ఉత్పత్తి అవదు. సాధారణ సమయంలో కూడా ఇలాంటి వారికి చలిగా అనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో చర్మం ఎండిపోవడం, బరువు పెరగడం, మాట తొట్రుపడటం వంటి లక్షణాలు కూడా ఉంటాయని వివరిస్తున్నారు.
శరీరంలో తగిన మేర కొవ్వు లేకపోవడం…
మనుషుల శరీరంలో కొవ్వు కూడా ఒక ముఖ్యమైన భాగం. అధిక కొవ్వు వల్ల ఎన్నో సమస్యలు రావడమే కాదు… అసలు కొవ్వు లేకపోవడంతోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా మన చర్మం కింద శరీరమంతటా విస్తరించి ఉండే కొవ్వు పొర మన శరీరాన్ని వేడిగా ఉంచేందుకు తోడ్పడుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలా శరీరంలో తగినంత కొవ్వు లేకపోవడం కూడా నిత్యం చలిగా అనిపించడానికి కారణమని పేర్కొంటున్నారు. ఇలాంటివారు తగినంత కొవ్వులు, ప్రొటీన్లు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు.
డీహైడ్రేషన్ సమస్య…
శరీరంలో తగిన స్థాయిలో నీటి నిల్వ లేకపోవడం కూడా నిత్యం చలిగా ఉండటానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో రక్త సరఫరా సరిగా ఉండటానికి, వేడి సమతుల్యత కోసం నీళ్లు తోడ్పడతాయని వివరిస్తున్నారు. రోజూ తగిన స్థాయిలో నీళ్లు తీసుకోవడం వల్ల ఈ సమస్య తప్పుతుందని స్పష్టం చేస్తున్నారు.
నిద్ర సరిగా లేకపోవడం (నిద్రలేమి)
మనం నిద్రపోయిన సమయంలోనే శరీరంలో దెబ్బతిన్న కణాల పునరుద్ధరణ, వ్యర్థాలను బయటికి పంపించే పని జరుగుతుంది. నిద్ర సరిగా లేకపోతే… శరీర కణాల పునరుద్ధరణ, వ్యర్థాల క్లీనింగ్ సరిగా జరగక జీవక్రియల వేగం మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత సమస్య తలెత్తుతుందని వివరిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ సాధారణ సమయంలోనూ చలిగా అనిపించడానికి కారణమని పేర్కొంటున్నారు. తగిన సమయం నిద్ర పోవడం వల్ల దీని నుంచి ఉపశమనం పొందవచ్చని వివరిస్తున్నారు.
ఈ అంశాలను గుర్తుంచుకోండి
పైన చెప్పిన ఆరోగ్య అంశాలు మనలో చలి ఫీలింగ్ కు కారణమే అయినా… ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కావొచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల వైద్యులను సంప్రదించి, అవసరమైతే తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.