- కేంద్రమంత్రితో పలు అంశాలను చర్చించామన్న ముఖ్యమంత్రి
- ఏపీ ఎక్కువ నీటిని తీసుకోకుండా అడ్డుకోవాలని కోరినట్లు చెప్పిన రేవంత్ రెడ్డి
- బనకచర్లపై ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇవ్వలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కేంద్రమంత్రితో పలు అంశాలపై చర్చించినట్లు చెప్పారు. కృష్ణా బేసిన్ నుండి ఏపీ ఎక్కువ నీటిని తీసుకుంటోందని ఆరోపించారు. ఏపీ ఎక్కువ నీటిని తీసుకోకుండా అడ్డుకోవాలని కోరినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్లపై కూడా అభ్యంతరం తెలిపామని వెల్లడించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణకు సంబంధించి గోదావరిపై ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు జరిగిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని కోరారు.
కృష్ణా జలాల విషయంలో వచ్చిన సమస్యలే భవిష్యత్తులో గోదావరి జలాల విషయంలోనూ వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడు కానీ అన్ని సమస్యలకు పరిష్కారం లభించదని అన్నారు.
బనకచర్లపై ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇవ్వలేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
బనకచర్లపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి డీపీఆర్ ఇవ్వలేదని కేంద్రమంత్రి చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయింపుల పెంపు పైనా చర్చించినట్లు చెప్పారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు కేంద్రాన్ని నిధులు అడిగినట్లు చెప్పారు. మొత్తం ఐదు ప్రాజెక్టులకు నిధులు అడిగామని మంత్రి తెలిపారు. టెలిమెట్రీలకు అవసరమైతే ఏపీ వాటాను కూడా భరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.