- దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పన్న స్పీకర్
- ప్రతిపక్ష హోదాపై జగన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం
- స్పీకర్‌కు దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాజీ సీఎం జగన్ కు చురకలు అంటించడంతోపాటు వైసీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు ..ప్రతిపక్ష హోదాపై తమపై నిందలు వేయడాన్ని తప్పు పట్టారు ..ప్రతిపక్ష హోదా పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి …అవి దేవుడు వారికీ ఇవ్వలేదు …దానికి పూజారిని నిందించి ఏమి ఫలితం అన్నారు ..
ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుండటంపై ఏపీ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడే తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పని చురక అంటించారు. ప్రతిపక్ష హోదాపై జగన్ నిరాధార ఆరోపణలతో తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యే జగన్ హైకోర్టుకు కూడా వెళ్లారని గుర్తు చేశారు. న్యాయ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దామనుకున్నానని చెప్పారు. జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చినట్టు తెలిపారు. స్పీకర్‌కు దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందికి వస్తుందని ఆయన హెచ్చరించారు.