- షోకాజ్ నోటీసులకు, సస్పెన్షన్లకు భయపడేది లేదన్న తీన్మార్ మల్లన్న
- కాంగ్రెస్ నుండి బహిష్కరించినప్పటికీ బీసీ ఉద్యమం ఆగదని వ్యాఖ్య
- కులగణన పారదర్శకంగా చేస్తేనే ఆదర్శంగా ఉంటుందన్న మల్లన్న
మనం ఏదైనా పని చేస్తే తరతరాలుగా గుర్తుంచుకోవాలని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తే ఆయన మంత్రివర్గంలోని మంత్రులే మరిచిపోతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. పార్టీ నుండి తనను బహిష్కరించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, షోకాజ్ నోటీసులకు, సస్పెన్షన్లకు భయపడేది లేదని అన్నారు. వారి పిల్ల గాండ్రింపులకు భయపడేవ్యక్తిని కాదని అన్నారు.
తనను కాంగ్రెస్ నుండి బహిష్కరించినప్పటికీ బీసీ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. కులగణన దేశానికి ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు. కులగణన ద్వారా రాహుల్ గాంధీ తలెత్తుకొని తిరగాలని తాను ఆశించానని, కానీ అలా జరగలేదని విమర్శించారు. నూటికి నూరు శాతం పారదర్శకంగా చేస్తేనే ఆదర్శంగా ఉంటుందని పేర్కొన్నారు. కులగణన ద్వారా అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించి, బీసీ వర్గాలను అణిచిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
భ్రమల్లో నుంచి రేవంత్ బయటకు రావాలి… 2028లో బీసీ నేత సీఎం కావడం ఖాయం: తీన్మార్ మల్లన్న

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిపై ఒత్తిడి చేసి తనను రేవంత్ సస్పెండ్ చేయించారని మండిపడ్డారు. తనను సస్పెండ్ చేస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుందననే భ్రమల్లో నుంచి రేవంత్ బయటకు రావాలని అన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రాదో చూస్తామని చెప్పారు. రేవంత్ కు నచ్చకపోయినా… 2028లో బీసీ నేత ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే కులగణనను తప్పుగా చూపారని చెప్పారు.
90 ఏళ్ల తర్వాత కులగణన చేస్తే చప్పట్లు కొట్టేవాడు ఒకడు కూడా లేడని అన్నారు. కులగణనపై రేవంత్ తో చర్చకు తాను సిద్ధమని చెప్పారు. పక్కనున్న వాళ్లు బానిసలుగా బతకాలనేది రేవంత్ వ్యక్తిత్వమని విమర్శించారు. రేవంత్ చేసిన కులగణన చిత్తు కాగితంతో సమానమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని మల్లన్న అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఒక న్యాయం… తనకు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. వి.హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ వంటి నేతలకు కాంగ్రెస్ లో స్వేచ్ఛ లేదని అన్నారు. పప్పు, బెల్లం మాదిరి రెడ్లు కార్పొరేషన్ పదవులను పంచుకున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని మల్లన్న ఆరోపించారు. చేవెళ్ల, మహబూబ్ నగర్, మల్కాజిగిరి ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకోవడానికి రేవంత్ సహకరించారని ఆరోపించారు. మహబూబ్ నగర్, మల్కాజిగిరి స్థానాల నుంచి ఎంపీలను గెలిపించుకోలేని రేవంత్ రెడ్డి… తనను గెలిపించారా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బలమైన కేసీఆర్ తో తాను కొట్లాడినప్పుడు రేవంత్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. రేవంత్ కూర్చున్న ముఖ్యమంత్రి కుర్చీకి పునాది పడటానికి తానే కారణమని చెప్పారు.
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై జానారెడ్డి, వీహెచ్ స్పందన

- గాలి మాటలు మాట్లాడితే కుదరదన్న జానారెడ్డి
- ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నానని వెల్లడి
- మల్లన్న అంశంతో తనకు సంబంధం లేదన్న వీహెచ్
తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. అయినప్పటికీ ఆయన ఏమాత్రం తగ్గలేదు. ఈరోజు కూడా మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ… గాలి మాటలు మాట్లాడితే కుదరదని చెప్పారు. తప్పు చేసిన వాడిని కూడా క్షమించే గుణం తనదని… తనను తిట్టినా పట్టించుకోనని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని… పాలన చేసే వారు అడిగితేనే తాను సలహాలు ఇస్తానని చెప్పారు. కులగణన అంశంలో తన పాత్ర లేదని తెలిపారు.
మరో సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ… తీన్మార్ మల్లన్న అంశంతో తనకు సంబంధం లేదని చెప్పారు. ఆ అంశాన్ని పార్టీ నాయకత్వం చూసుకుంటుందని అన్నారు. పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు చెప్పానని తెలిపారు.

కొంతమంది బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మంత్రి సీతక్క విమర్శలు గుప్పించారు. ఈరోజు తీన్మార్ మల్లన్న మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్ ఇచ్చారు.
కులగణనపై అభ్యంతరాలు ఉండి ఉంటే శాసనమండలిలో మాట్లాడవచ్చని సూచించారు. బీఆర్ఎస్ చేయలేనిది తమ ప్రభుత్వం చేసినందుకు అభినందించాల్సింది పోయి విమర్శించడం సరికాదని ఆమె అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. కులగణనకు 50 రోజుల సమయం ఇచ్చామని తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: