Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నాం: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన

  • ఎస్సీ వర్గీకరణ అమలుకు ఏపీ ప్రభుత్వం ముందడుగు
  • నేడు ఏపీ అసెంబ్లీలో చర్చ
  • కీలక ప్రసంగం చేసిన సీఎం చంద్రబాబు 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను స్పష్టం చేశారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీలకు వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారని చంద్రబాబు వెల్లడించారు

చరిత్రలో కొన్ని కులాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉండటానికి గల కారణాలను విశ్లేషించిన అనంతరం, స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయన్న విషయం స్పష్టమవుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా కులాలు వెనుకబడిన వర్గాలుగా అనిపిస్తే వర్గీకరణ చేయొచ్చని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చిందని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉంటుందని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు. బుడగ జంగాల సమస్యను పరిష్కరించడానికి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపి, కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత వారిని ఎస్సీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

జిల్లా వారీగా కేటగరైజేషన్ తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, 2026లో జరగబోయే జనాభా లెక్కల సేకరణ తర్వాత ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అన్ని పార్టీలు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు.

మంద కృష్ణ మాదిగ ఉద్యమం సమయంలో మాదిగల సమస్యలను గుర్తించి, జస్టిస్ రామచంద్ర రావు కమిషన్ వేసి, వారి సిఫార్సుల మేరకు నాలుగు కేటగిరీలుగా వర్గీకరించామని చంద్రబాబు నాయుడు తెలిపారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ జారీ చేసి, చట్టం కూడా తీసుకువచ్చామని గుర్తు చేశారు.

జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ కూడా వర్గీకరణ అవసరమని సమర్థించిందని, ఇటీవల జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని తెలిపారు. ఆర్.ఆర్. మిశ్రా కమిషన్ సిఫార్సుల మేరకు ఎస్సీలను గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3గా వర్గీకరించామని, జనాభా, వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు వెల్లడించారు.

ఈ సందర్భంగా కుల వివక్షత నిర్మూలనకు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కృషిని ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపడానికి అనేక జీవోలు జారీ చేశామని, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చూశామని తెలిపారు.

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, సామాజిక న్యాయం కోసం ఎన్టీ రామారావు చేసిన కృషిని స్మరించుకున్నారు. బాలయ్యోగిని లోక్‌సభ స్పీకర్‌గా, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్‌గా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని ఆయన అన్నారు. కాకి మాధవరావును చీఫ్ సెక్రటరీగా నియమించామని గుర్తు చేశారు.

రాష్ట్రపతిగా కె.ఆర్. నారాయణన్, అబ్దుల్ కలాంలను ఎన్నుకోవడంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించిందని చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ కూటమి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, భవిష్యత్తులోనూ ఈ దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

తూర్పు కాపులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదన్న సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జనసేన, బీజేపీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నూతన సంవత్సరంలో పి-ఫోర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, దీని ద్వారా సమాజంలో పేదరికాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

చివరగా, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల జాబితాలో బుడగ జంగం కమ్యూనిటీని చేర్చాలని కోరుతూ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది, దీనిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Related posts

ఏపీలో వైద్య కళాశాలల ఏర్పాటుపై మండలిలో మాటల యుద్ధం…

Ram Narayana

జగన్ కు చురకలు …వైసీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన ఏపీ స్పీకర్ …

Ram Narayana

ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు…

Ram Narayana

Leave a Comment