డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో మరణశిక్ష విధించే అవకాశముందని కథనాలు
ఓడలో డ్రగ్స్ తరలిస్తుండగా ముగ్గురు తమిళులను అరెస్టు చేసిన ఇండోనేషియా పోలీసులు
ఓడ కెప్టెన్, ముగ్గురు తమిళులకు మరణశిక్ష విధించే అవకాశముందని కథనాలు
డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు భారతీయులకు ఇండోనేషియా న్యాయస్థానం మరణశిక్ష విధించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది జులైలో సింగపూర్ జెండా కలిగిన ఓడలో డ్రగ్స్ తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించి 106 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇండోనేషియా పోలీసులు తెలిపారు.
మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న తమిళనాడుకు చెందిన రాజు ముత్తుకుమారన్, సెల్వదురై దినకరన్, విమలకందన్‌లను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. త్వరలో ఈ ముగ్గురు నిందితులతో పాటు ఓడ కెప్టెన్‌కు అక్కడి కోర్టు మరణశిక్ష విధించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఏప్రిల్ 15న తీర్పు వెలువడే అవకాశం ఉంది. వీరి తరఫున భారతీయ న్యాయవాది జాన్ పాల్ కేసును వాదిస్తున్నారు.
కెప్టెన్‌కు తెలియకుండా ఓడలో ఇంత పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు తరలించడం సాధ్యం కాని విషయమని, కుట్ర పన్ని అమాయకులైన ముగ్గురిని ఈ కేసులో ఇరికించారని న్యాయవాది జాన్ పాల్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో అసలైన నేరస్థులు తప్పించుకోకుండా చూడాలని ఆయన కోరారు.