ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు – మాజీ ఎంపీ నామ
ఖమ్మంః ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు బీఆర్‌ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఉగాది పర్వదినం సందర్భంగా శనివారం విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొని, ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది మన సంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబించేది మాత్రమే కాకుండా, నూతన ఆశలు, కొత్త లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే అద్భుతమైన శుభదినమని ఆయన పేర్కొన్నారు. ఉగాది పచ్చడి మాదిరిగా జీవితం కూడా చేదు, తీపి, కారం, వగరు, పులుపు, ఉప్పు రుచులతో కూడి ఉంటుందని, సమస్యలను సమర్థంగా ఎదుర్కొంటూ విజయపథంలో ముందుకు సాగాలని ప్రజలను కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు భాషా గౌరవం, సంస్కృతి పరిరక్షణ, వ్యవసాయ రంగం అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపుదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత శ్రద్ధ చూపించాలని సూచించారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువతకు కొత్త సంవత్సరంలో మరింత మంచి కలుగాలని అభిలషించారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఇంటా శాంతి, సమృద్ధి, ఆనందాన్ని తెచ్చిపెట్టాలని కోరుకుంటూ, మరోసారి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.