- చిట్టీ రాసిస్తే చాలు కొడంగల్ వచ్చి పనులు పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి
- ఒక్క సంతకంతో కొడంగల్‌ను వెతుక్కుంటూ అన్నీ అక్కడకే వస్తాయని వ్యాఖ్య
- ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన రేవంత్ రెడ్డి
- తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి ఉగాది శుభాకాంక్షలు
కొడంగల్ అభివృద్ధి కోసం ఎవరూ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదని, ఒక లేఖ రాసిస్తే తానే స్వయంగా కొడంగల్‌కు వచ్చి పనులన్నీ పూర్తి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్క సంతకంతో కొడంగల్‌ను వెతుక్కుంటూ అన్నీ అక్కడికే వస్తాయని ఆయన హమీ ఇచ్చారు.
కొడంగల్ ప్రజలు వెళ్లి ఎవరినో, ఏదో అడగాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఈరోజు తన కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గ కేంద్రంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనకు పాలించే శక్తిని ప్రసాదించింది కొడంగల్ ప్రజలే అని అన్నారు. కొందరికి అధికారం కోల్పోయినందుకు దుఃఖం ఉండవచ్చని, అలాంటి వారిని పట్టించుకోవద్దని వ్యాఖ్యానించారు. ముస్లిం సామాజిక వర్గానికి ఎక్కువ అవకాశాలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీయే అని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి తన కొడంగల్ పర్యటనలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
రేవంత్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది రోజున సన్న బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కొత్త సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.