Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు.. ఆ మూడు గంటలు ఎక్కడున్నారంటే?

  • ఈ నెల 24న హైదరాబాద్ నుంచి బుల్లెట్‌పై రాజమహేంద్రవరం బయలుదేరిన పాస్టర్
  • మధ్యాహ్నం కోదాడలో మద్యం కొనుగోలు
  • కంచికచర్ల–పరిటాల మధ్య అదుపుతప్పి కిందపడటంతో గాయాలు
  • పగిలిపోయిన బుల్లెట్ హెడ్ ల్యాంప్.. చేతికి గాయాలు
  • రామవరప్పాడు రింగ్ వద్ద పాస్టర్ కు ఎస్సై ప్రవీణ్ సాయం
  • ఆ పక్కనే ఉన్న పార్క్‌లో మూడు గంటలపాటు విశ్రాంతి  

సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు ఒక్కో చిక్కుముడిని విప్పుతున్నారు. విజయవాడలో ప్రవీణ్ మూడు గంటలపాటు ఎక్కడ ఉన్నారన్న విషయంలో కొంత స్పష్టత వచ్చింది. రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్టు పోలీసులు చెప్పడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు సేకరించిన పోలీసులు ప్రవీణ్ ప్రతి కదలికను గుర్తించినట్టు సమాచారం. ఇందుకోసం విజయవాడ, రాజమహేంద్రవరం పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజీలను విశ్లేషించారు. 

ప్రవీణ్ మహానాడు కూడలి దాటిన తర్వాత రామవరప్పాడు రింగ్ వస్తుంది. అక్కడి సీసీ కెమెరాల్లో ప్రవీణ్ జాడ కనిపించలేదు. దీంతో మహానాడు కూడలి, రామవరప్పాడు రింగ్‌కు మధ్యలో ఏదో జరిగి ఉంటుందని అనుమానించారు. రామవరప్పాడు రింగ్‌కు 10 మీటర్ల దూరంలో వోక్స్ వ్యాగన్ షోరూంకు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పైనుంచి ప్రవీణ్ కిందపడినట్టు గుర్తించారు. గమనించిన ఆటో డ్రైవర్లు రింగ్‌లో విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సై సుబ్బారావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు తెలిసింది. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని కిందపడిన పాస్టర్‌ను పైకిలేపి రెయిలింగ్ వద్ద కూర్చోబెట్టారు. 


ఎస్సై వారించినా వినకుండా..
కాసేపటి తర్వాత పాస్టర్‌ను ఎస్సై నడిపించగా, ఆటోడ్రైవర్ బుల్లెట్‌ను తోసుకుంటూ రింగ్ వద్దనున్న ట్రాఫిక్ బూత్ దగ్గరకు తీసుకెళ్లారు. ప్రవీణ్ ముఖం కడుక్కునేందుకు ఎస్సై నీళ్లు ఇచ్చారు. ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి 8.20 గంటల వరకు ప్రవీణ్ నిద్రపోయినట్టు తెలిసింది. అంటే.. కనిపించకుండా పోయిన ఆ మూడు గంటలు ఆయన పార్క్‌లో నిద్రపోయినట్టు సమాచారం. నిద్ర లేచాక బుల్లెట్ నడిపేందుకు ప్రయత్నించగా ఎస్సై అడ్డుకున్నారు. మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఇన్నోటెల్ హోటల్ పక్కనే ఉన్న టీస్టాల్ వద్దకు తీసుకెళ్లి టీ ఇప్పించారు. టీ తాగిన అనంతరం ఎస్సై వారించినా వినకుండా ప్రవీణ్ బుల్లెట్‌పై ఏలూరు వైపు బయలుదేరినట్టు తెలిసింది. ఈ దృశ్యాలన్నీ ఇన్నోటెల్ హోటల్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మరోవైపు, ఏలూరు చేరుకున్న ప్రవీణ్ అక్కడ టానిక్ వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి రూ. 350 ఫోన్ పే చేశారు. ఈ ఫుటేజీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

పగిలిపోయిన బుల్లెట్ హెడ్ ల్యాంప్
హైదరాబాద్ నుంచి ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ప్రవీణ్ అన్ని ఏర్పాట్లతోనే రాజమహేంద్రవరం బయలుదేరారు. విజయవాడ చేరుకోవడానికి ముందు పలుచోట్ల ఆగినా ఎక్కడా హెల్మెట్ తీయలేదు. రామవరప్పాడు రింగ్ సమీపంలో పడిపోయినప్పుడు ఆయన ఎవరో ట్రాఫిక్ ఎస్సై సుబ్బారావుకు తెలియదు. వాహనం హెడ్ ల్యాంప్ పగిలిపోయి వైరుతో వేలాడుతుండటం, సేఫ్టీ రాడ్లు వంగిపోవడం, చేతులు కొట్టుకుపోయి గాయాలు కావడం, హెల్మెట్ సొట్టలు పడటంతో ఎస్సై ఫొటోలు, వీడియోలు తీశారు. 

కోదాడలో మద్యం కొనుగోలు
హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌పై బయలుదేరిన ప్రవీణ్ మధ్యాహ్నం కోదాడలో ఆగి ఓ మద్యం దుకాణంలో ఫోన్ పే ద్వారా రూ. 650 చెల్లించి మద్యం కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో ప్రవేశించడానికి ముందు మద్యం తాగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం కంచికచర్ల–పరిటాల మధ్య అదుపుతప్పి కిందపడటంతో గాయాలయ్యాయి. బుల్లెట్ హెడ్ ల్యాంప్ పగిలిపోయింది. ఆయన చేతికి గాయాలయ్యాయి. అక్కడి నుంచి గొల్లపూడి చేరుకున్నాక పెట్రోలు పోయించుకున్నారు. అప్పటికే ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు బంక్ సిబ్బంది పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.

పెట్రోలు పోయించుకున్నాక రూ. 872 ఫోన్ పే చేసినట్టు సిబ్బంది తెలిపారు. ఆయన చేతికి గాయాలు ఉన్నాయని, బుల్లెట్ హెడ్ ల్యాంప్ ఊడిపోయి ఉందని బంక్ సిబ్బంది చెప్పినట్టు సమాచారం. అనంతరం దుర్గగుడి ఫ్లై ఓవర్, రాజీవ్‌గాంధీ పార్క్, పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ మీదుగా బెంజిసర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌ ఎక్కి మహానాడు జంక్షన్‌కు చేరుకున్నట్టు తెలిసింది.

Related posts

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కష్టాలు!

Drukpadam

అమృత్ పాల్ తప్పించుకోవడంపై హైకోర్టు సీరియస్…

Drukpadam

అందుకే రోహిత్ శ‌ర్మ బాగా ఆడ‌లేదు: టీమిండియా ఘోర ఓట‌మిపై సునీల్ గ‌వాస్క‌ర్ వ్యాఖ్య‌లు

Drukpadam

Leave a Comment