- ఆఫ్ షోర్ మైనింగ్ టెండర్లపై రాహుల్ స్పందన
- సముద్ర జీవులకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన
- పర్యావరణ ప్రభావాలను అంచనా వేయకుండా అనుమతులు ఎలా ఇస్తారని విమర్శలు
కేరళ, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల సముద్ర తీరాల్లో (ఆఫ్ షోర్ మైనింగ్) తవ్వకాలకు అనుమతిస్తూ జారీ చేసిన టెండర్లను రద్దు చేయాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆఫ్ షోర్ మైనింగ్ వల్ల సముద్ర జీవులకు ముప్పు వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభావాలను క్షుణ్ణంగా అంచనా వేయకుండా ప్రైవేట్ సంస్థలకు సముద్ర గనుల తవ్వకాల కేటాయింపులు చేయడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. “కేరళ, గుజరాత్, అండమాన్ నికోబార్ తీరాల్లో సముద్ర గనుల తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన నిర్ణయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను” అని ప్రధాన మంత్రికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.
పర్యావరణ ప్రభావాలను అంచనా వేయకుండా సముద్ర గనుల తవ్వకాల టెండర్లను జారీ చేసిన విధానానికి వ్యతిరేకంగా తీర ప్రాంత ప్రజలు నిరసన తెలుపుతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీనివల్ల తమ జీవనోపాధి, జీవన విధానంపై ప్రభావం చూపుతుందని లక్షలాది మంది మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వివరించారు.
2023లో సవరించిన ఆఫ్ షోర్ ఏరియాస్ మినరల్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టంపై తీవ్ర అభ్యంతరాలు ఎదుర్కొన్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. ఆఫ్ షోర్ మైనింగ్ వల్ల సముద్ర జీవులకు ముప్పు, పగడపు దిబ్బలకు నష్టం మరియు చేపల నిల్వలు తగ్గిపోవడం వంటి ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయని పేర్కొన్నారు.