కేసీఆర్ ఆదేశానుసారం వక్ఫ్ బిల్లు ను రాజ్యసభలో వ్యతిరేకించిన బీఆర్ యస్
- బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
వక్ఫ్ సవరణ బిల్లును పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తాము రాజ్యసభలో వ్యతిరేకించామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్రలు చెప్పారు.ముస్లింల మనోభవాలను తమ పార్టీ బీఆర్‌ఎస్ మొదటి నుంచి గౌరవిస్తున్నదని,ఇక ముందు,ఎప్పటికీ కూడా గౌరవిస్తుందన్నారు.కాంగ్రెస్ అబద్దాలు చెప్పి, అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని వారు విమర్శించారు.ఢిల్లీ తెలంగాణ భవన్ శుక్రవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, రవిచంద్రలు విలేకరులతో మాట్లాడారు. ముస్లింలకు వ్యతిరేకమైన వక్ఫ్ సవరణ బిల్లును బీఆర్‌ఎస్ రాజ్యసభలో వ్యతిరేకించిందని తెలిపారు. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పటికీ ప్రజల పక్షాన పోరాటంలో ముందడుగులో ఉన్నామన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ఎండగడుతున్నదని సురేష్ రెడ్డి, రవిచంద్రలు వివరించారు.ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలన్నింటిని బీఆర్‌ఎస్ ఎండగడుతున్నదని చెప్పారు.పార్లమెంటులో తమ పార్టీ సంఖ్యాబలం తక్కువ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను మాత్రం వ్యతిరేకిస్తూనే ఉన్నామన్నారు.అబద్దాలతో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అబద్దాల పునాదులపైనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు.ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీని తాము అడుగడుగునా అడ్డుకుంటున్నామన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు మంచిదని వారు ఆలోచన చేసుంటే రంజాన్ పండుగకు ముందే పార్లమెంటులో ప్రవేశపెట్టి రంజాన్ తోఫా అని చెప్పుకునేవారని అభిప్రాయపడ్డారు.