
- 86 మంది మావోయిస్టు మిలీషియా సభ్యుల లొంగు బాటు
- ఐజీ పి. చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ సమక్షంలో సరెండర్
- శాంతి చర్చలు ప్రభుత్వం నిర్ణయం మేరకే జరుగుతాయన్న ఐజీ
- తెలంగాణలో ఇంకా 95 మంది మావోయిస్టులున్నారని వెల్లడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. శనివారం 86 మంది మావోయిస్టు మిలీషియా సభ్యుల ఐజీ పి. చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ ఎదుట లొంగి పోయారు. ఆఫరేషన్ చేయూతలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 81 మంది, ములుగు జిల్లాకు చెందిన ఐదుగురు సరెండరయ్యారు. లొంగి పోయిన వారిలో నలుగురు ఏసీఎం సభ్యులు, నలుగురు పార్టీ సభ్యులు వుండగా, మిగిలిన వారిలో వివిధ సంఘాలకు చెందిన మిలీషియా సభ్యులు వున్నారు. ఏసీఎం సబ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, పార్టీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష, మిలీషియా సభ్యులకు ఒక్కొక్కరికి 25 వేల రూపాయలు చొప్పున పారితోషికం అందజేశారు. ఈ సందర్భంగా ఐజీ పి. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మావోయిస్టులతో శాంతి చర్చలు జరపడమనేది ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వాల ఆదేశాల ప్రకారమే ముందుకు వెళతామని స్పష్టం చేశారు. తెలంగాణా ప్రాంతంలో ఇంకా 95 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టులు ఉన్నట్లు తమ వద్ద సమాచారం వుందన్నారు. వారంతా కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలి జన జీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. లొంగి పోయిన వారికి పునరావాసం కల్పించడంతో పాటు ప్రభుత్వం నుండి వచ్చే అన్ని ప్రోత్సాహకాలను అందజేస్తామన్నారు. మావోయిస్టుల లొంగుబాటులో సీఆర్పీఎఫ్ చొరవ అమోఘమైందని ప్రశంసించారు. మావోయిస్టుల పట్ల జిల్లా పోలీసుల వైఖరి నచ్చి వీరంతా లొంగి పోయారని చెప్పారు. మిగిలిన మావోయిస్టులు కూడా జన జీవన స్రవంతిలో కలిసేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.