తెలుగు సంఘాల చందాల వ్యవహారం అమెరికాలో పెను దుమారం రేపింది. ఈ మ్యాచింగ్ గ్రాంట్ల కుంభకోణం కారణంగా ఫెడరల్ నేషనల్ మార్ట్‌గేజ్ అసోసియేషన్ (ఫ్యానీ మే) ఏకంగా 700 మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. వీరిలో దాదాపు 200 మంది తెలుగువారు ఉండటం గమనార్హం. నైతిక విలువల ప్రాతిపదికన ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్ లలో వర్జీనియా, డాలస్ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు.
కంపెనీని మోసం చేసేందుకు ఉద్యోగులు కొన్ని తెలుగు సంస్థలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికాలో గత సంవత్సరం వెలుగులోకి వచ్చిన చందాల కుంభకోణం వివరాల్లోకి వెళితే… ఒక ఉద్యోగి స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇస్తే, అతడు పనిచేసే కంపెనీ కూడా అంతే మొత్తం విరాళంగా ఇస్తుంది. దీనినే మ్యాచింగ్ గ్రాంట్ అంటారు. అయితే, ఉద్యోగులు తప్పుడు పత్రాలు సృష్టించి చందాలు ఇచ్చినట్లు చూపించారనేది ప్రధాన ఆరోపణ. ఇలా అమెరికాలోని తెలుగు సంఘాలైన తానా, ఆటా వంటి సంస్థలకు బోగస్ చందాలు వెళ్లాయని ఆరోపణలు రావడంతో FBI సైతం దర్యాప్తు చేపట్టింది.
ఉద్యోగం కోల్పోయిన వారిలో ఒకరు తానాలో ప్రాంతీయ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని… మరొకరు ఆటా మాజీ అధ్యక్షుడి భార్య అని సమాచారం! ఈ కేసులో వివరణ ఇవ్వాలని నార్త్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కరోలీనా కోర్టు గత డిసెంబర్‌లో తానాకు సమన్లు జారీ చేసింది. 2019 నుండి 2024 వరకు విరాళాలకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని ఆదేశించింది.
ఈ వివాదం కారణంగానే ‘ఫ్యానీ మే’ కంపెనీ నైతికత అంశాన్ని పరిగణలోకి తీసుకుని 200 మంది తెలుగువారిని తొలగించింది. ఇదిలా ఉండగా, మ్యాచింగ్ గ్రాంట్ల దుర్వినియోగం ఆరోపణలపై ఆపిల్ కంపెనీ కూడా గత సంవత్సరం 100 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.