Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
Sita Ramula Pattabhishekam
ఖమ్మం వార్తలుతెలంగాణ వార్తలు

పట్టాభిషిక్తుడైన కళ్యాణ రాముడు

  • నేత్ర పర్వంగా భద్రాచల రాముని మహా పట్టాభిషేక మహోత్సవం
  • ప్రధాన ఆలయంలో కల్ప వృక్ష వాహనంపై రాములోరి ఊరేగింపు
  • పాదుకలు, రాజదండం, ముద్రిక, చామరం, ఛత్రం, ఖడ్గం, మకుటంతో అలంకరణ
  • పుష్కర నదుల నుండి తెచ్చిన దివ్య జలాలతో  పట్టాభి రామునికి అభిషేకం    
  • పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ జిష్ణు దేవ్, మంత్రి తుమ్మల, రామదాసు వారసులు

సీతమ్మను మనువాడిన భద్రాచల రామయ్య సోమవారం పటాభిషిక్తుడయ్యాడు. శ్రీరామ నవమి జరిగిన మరుసటి రోజే ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి మహా పట్టాభిషేక మహోత్సవం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. భద్రాచల రామయ్య తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండు ప్రధాన ఘట్టాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అందులో ఒకటి శ్రీ సీతారాముల కళ్యాణం కాగా, రెండవది రామయ్య పట్టాభిషేక మహోత్సవం. స్వామి వారి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించగా, పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పట్టు వస్త్రాలను అందజేశారు. ముందుగా, ఆయన ప్రధానాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ రమాదేవి, గవర్నర్ కు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. రాష్ట్ర గవర్నర్లు శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవాలకు రావడం 2011 నుండి మొదలైంది. అప్పటి నుండి ఏటా గవర్నర్లు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ భద్రాచలం వచ్చి స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఆయనతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, భక్త రామదాసు వారసులు రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 10.30 గంటలకు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రారంభమైన ఈ పట్టాభిషేక మహోత్సవం, మధ్యాహ్నం 12.45 గంటల వరకు సాగింది. పట్టాభిషేక క్రతువులో భాగంగా తొలుత ప్రధానాలయంలో స్వామి వారిని కల్ప వృక్ష వాహనంపై ఊరేగించారు. అనంతరం సామూహిక పారాయణం, హోమం చేశారు. ఈ తంతు పూర్తయిన తర్వాత, సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేత రాముల వారిని మిథులా స్టేడియంలోని శిల్ప కళా వేదిక వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలి వచ్చిన భక్తులు, పెద్ద ఎత్తున జై శ్రీరాం అంటూ నీరాజనాలు పలికారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వేదికపై ఆసీనులైన తర్వాత, అర్చక స్వాములు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం నిర్వహించారు. వేద పండితులు పట్టాభిషేక మహోత్సవ విశిష్టతను వివరించారు. వైదిక సిబ్బంది పుష్కర నదుల నుండి తెచ్చిన దివ్య జలాలను కలుశాలలో వుంచి, దేవతావాహన పూజలు చేశారు. దేవతులు, పవిత్ర నదీ జలాల ప్రత్యేకతను భక్తులకు వివరిస్తూ ఆవాహన పూజలు పూర్తి చేశారు. అనంతరం, స్వామి వారికి పాదుకలు, రాజ దండం, రాజ ముద్రిక, సువర్ణాభరణాలు, చామరం, స్వర్ణ ఛత్రం, రాజ ఖడ్గం, రాజ మకుటం ఒక్కొక్కటీ వరుసగా ధరింపజేశారు. చివరిగా అర్చక స్వాములు ముత్యాల హారాన్ని రామయ్య మెడలో వేసి అలంకరించారు. ఆ తర్వాత, అదే హారాన్ని తీసి సీతమ్మ మెడలో వేశారు. మళ్ళీతీసి భక్త హనుమాన్ కు ధరింపజేశారు. స్వామి వారు ఆ హారాన్ని బహుమానంగా సీతమ్మ మెడలో వేస్తే, సీతమ్మ తల్లి అభీష్టం మేరకు, మళ్ళీ ఇద్దరూ కలిసి హారాన్ని హనుమంతుడికి అలంకరించారని, ఈ ముత్యాల హారానికి గల చరిత్రను వేద పండితులు ఈ సందర్భంగా వివరించారు. ఇది హనుమంతుడికి దక్కిన మహద్భాగ్యమని అభివర్ణించారు. ఈ అలంకరణ ఘట్టం పూర్తి కాగానే, రామయ్యకు పలు నామాలతో స్వర్ణ పుష్పార్చన చేశారు. అనంతరం, అంతకు ముందు దేవతలను ఆవాహనం చేసిన కలుశాలలోని పవిత్ర నదులు, సముద్రాల దివ్య జలాలతో అర్చక స్వాములు స్వామి వారికి అభిషేకం చేశారు. దీంతో శ్రీ సీతారామచంద్ర స్వామి మహా పట్టాభిషేక మహోత్సవం పూర్తయింది. ఈ వేడుకలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసన సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, భద్రాచలం ఐటీడీఏ పపీఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. 

ట్రైబల్ మ్యూజియాన్ని ప్రారంభించిన గవర్నర్

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియాన్ని ప్రారంభించారు. మిథులా స్టేడియంలో శ్రీ సీతారామచంద్ర స్వామి మహా పట్టాభిషేక మహోత్సవం ముగుసిన తర్వాత, ఆయన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఐటీడీఏ పీవో బి. రాహుల్ తో కలిసి ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజియంలో ఆయన గిరిజనులు దైనందిన జీవితంలో వాడే పని ముట్లు, వ్యవసాయ, సంస్కృతీ, సాంప్రదాయాలను చాటి చెప్పే వస్తువులు, గిరిజనుల అటవీ ఉత్పత్తులను ఆశక్తితో తిలకించారు. అక్కడున్న ప్రజా ప్రతినిధులు, అధికార్లు, గిరిజనులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఉదయమే హైదారాబాద్ నుండి హెలికాప్టర్లో సారపాక వచ్చిన గవర్నర్ కు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ ఐటీసీ అతిధి గృహంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

Related posts

తెలంగాణపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు… వినోద్ కుమార్ కౌంటర్

Ram Narayana

యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ సీఎం కేసీఆర్

Ram Narayana

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమావేశం

Ram Narayana

Leave a Comment