
- గుండె పోటుతో పద్మశ్రీ వన జీవి రామయ్య మృతి
- అకుంటిత దీక్షతో కోటికి పైగా మొక్కలు నాటిన వన జీవి
- 2017లో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మ శ్రీ అవార్డు
- మహారాష్ట్ర, తెలంగాణలో పాఠ్యాంశంగా రామయ్య జీవితం
- ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సంతాపం
ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వన జీవి రామయ్య ( 85 ) కన్ను మూశారు. శనివారం తెల్లవారు జామున ఆయన ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె పోటుతో తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న రామయ్య ఇంట్లో స్పృహ తప్పి పోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని ఆర్ఎంపీ వద్దకు, ఆతర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు. అక్కడ చికిత్స పొందుతూ రామయ్య మరణించారు. ఆయన మృతి పట్ల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్, మాజీ మాత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం ప్రకటించారు. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. మొక్కలు పెంచడంలో రామయ్య కృషి అందరికీ స్పూర్తి దాయకమన్నారు. ఆయన మరణం పర్యావరణ పరి రక్షణకు తీరని లోటని పేర్కొన్నారు.
విత్తనం నుండి పద్మం వరకు

వన జీవి రామయ్య 1937 జూలై1న ఖమ్మం రూరల్ మండలంలోని ముత్తగూడెంలో లాలయ్య, పుల్లమ్మ దంపతులకు జన్మించారు. పుట్టి పెరిగిన ముత్తగూడెంలోనే 5 వ తరగతి వరకు చదువుకున్నారు. కొణిజర్ల మండలంలోని తుమ్మల పల్లికి చెందిన జానకమ్మను పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కొడుకులు, ఒక కూతురు కాగా, రెండవ కొడుకు అనారోగ్యంతో మరణించాడు. రామయ్యకు సంబంధించిన కొంత భూమి అదే మండలంలోని రెడ్డి పల్లిలో ఉండడంతో ఆయన ముత్తగూడెం నుండి రెడ్డిపల్లికి మకాం మార్చారు. రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. ఆయన విరివిగా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, అందరికీ విత్తనాలు,- మొక్కలు పంచడం వల్ల ‘వన జీవి’ రామయ్యగా గుర్తింపు పొందారు. పెద్దగా చదువు కోక పోయినా పాఠశాల దశలోనే మొక్కలపై గురువు పెంచిన అవగహనతో వాటి పెంపకం పట్ల ఆశక్తి పెంచుకున్నారు. మొక్కలు పెంచడాన్ని తల్లిని చూసి నేర్చుకున్నారు. మొదట తనకున్న 40 కుంటల భూమిలో వివిధ రకాల మొక్కలు పెంచారు. ఎండా కాలం అడవిలో విత్తనాలు సేకరించి, బస్తాల్లో వాటికి భద్ర పర్చేవారు. తొలకరి పడగానే, రోడ్ల ప్రక్కన, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, బంజర భూముల్లో వాటిని చల్లే వారు. అంతే కాకుండా అందరికీ విత్తనాలు పంచి ఖాళీ ప్రదేశాల్లో చల్లమనే వారు. ఇలా విత్తనాలు పంచడం, మొక్కలు నాటడం రామయ్య దిన చర్యగా మారింది. రామయ్య వృతి రీత్యా పాల వ్యాపారైనప్పటికీ, మొక్కల పెంచడాన్ని మాత్రం వదిలి పెట్ట లేదు. ఒక ప్రక్క భార్య, నలుగురు పిల్లలను సాకుతూనే దశాబ్దాల తరబడి విస్తృతంగా మొక్కలు నాటారు. విత్తనాలు సేకరించడానికి, మొక్కలు నాటాడానికి సైకిల్ పై ఎంత దూరమైనా వెళ్ళే వారు. ఆ తర్వాత కొంత కాలానికి మొక్కల పెంపకం పట్ల రామయ్య అంకిత భావాని భాహుమానంగా ప్రభుత్వం ఓ మోపెడ్ ను బహుకరించింది. భార్య జానకమ్మ కూడా భర్త అడుగు జాడల్లోనే నడిచింది. ఆయన మనవళ్లు, మనవరాళ్ళకు సైతం ఆయన మొక్కల పేర్లే పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా వృక్షో రక్షతి రక్షతహ: అని రాసిన వృత్తాకారము బోర్డును తలకు లేదా మెడకు తగిలింకుకొని మొక్కల పెంపకంపై అందరికీ అవగన కలిగించారు.
2017లో వరించిన పద్మశ్రీ

వన జీవి రామయ్య కోటికి పైగా మొక్కలు నాటి ‘పద్మశ్రీ’ అవార్డుకు ఎంపికయ్యాడు. 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.1995 లో తొలి సారి ఆయనను ‘కృషి సేవ’ అవార్డు వరించింది. 2005 లో వన మిత్ర, 2015 లో జాతీయ ఆవిష్కరణలు మరియు అత్యుత్తమ సాంప్రదాయ జ్ఞాన అవార్డులు దక్కాయి. మహారాష్ట ప్రభుత్వం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా బోధిస్తోంది. తెలంగాణలో కూడా ఆయన జీవితాన్ని 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా చేర్చారు. ఆయన నిరాడంబర జీవితపై ‘విత్తనం నుండి పద్మం వరకు వన జీవి ప్రయాణం’ అనే పుస్తకం కూడా వెలువడింది. రామయ్య సేవలను రాష్ట్ర పతుల నుండి సామాన్య పౌరుడికి వరకూ ప్రశంసించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం ఆయనను అభినంధించారు. ఎటు వంటి లాభాపేక్ష లేకుండా రామయ్య చేసిన నిశ్వార్ధ సేవ పలువురికి ఆదర్శవంతంగా నిలిచింది.




