అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి రాత్రి వేళ తీసిన కొన్ని అద్భుతమైన చిత్రాలు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. . వీటిలో, నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద కాంతివంతంగా వెలిగిపోతున్న భారతదేశం ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫొటోలకు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది.
ఐఎస్ఎస్ విడుదల చేసిన ఈ చిత్రాలలో మధ్య పశ్చిమ అమెరికాలోని మేఘావృతమైన ప్రాంతం, ఆగ్నేయాసియా తీర, లోతట్టు ప్రాంతాలు, ఆకుపచ్చని కాంతులతో ఆవరించి ఉన్న కెనడాను కూడా చూడొచ్చు. భూమి వక్రత కారణంగా, ఈ ఫొటోల్లో ఆకాశం వంపు తిరిగినట్టుగా మరింత అందంగా కనిపిస్తోంది.
‘నక్షత్రాలు, నగర కాంతులు, మరియు భూమి యొక్క వాతావరణ కాంతిని ఒకేసారి చూడగలిగినప్పుడు’ అనే శీర్షికతో ఈ చిత్రాలను ఐఎస్ఎస్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఈ చిత్రాలు కాసేపట్లోనే వైరల్ అయ్యాయి.
ఐఎస్ఎస్ భూమి నుంచి 370-460 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ నిరంతరం ఇలాంటి చిత్రాలను పంచుకుంటుంది. ఇదివరకూ మహా కుంభమేళా చిత్రాన్ని కూడా ఐఎస్ఎస్ నుంచి నాసా వ్యోమగామి డొనాల్డ్ పెట్టిట్ పంచుకున్నారు.