- ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అన్న మంత్రి
- జీవో మొదటి కాపీనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించినట్లు వెల్లడి
- ఈరోజు నుంచి భారీస్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామన్న దామోదర
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేశామని, మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొన్ని వేల విజ్ఞప్తులు వచ్చాయని, వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేశామని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను విడుదల చేసి, మొదటి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసినట్లు వారు చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై గతంలో అసెంబ్లీలో అన్ని పార్టీల వారు మాట్లాడారని, కానీ ఏ ఒక్క పార్టీ కూడా దీనిని ముందుకు తీసుకువెళ్లలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. దళితుల్లో సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు ఉండకూడదని ఆకాంక్షించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
కొన్ని వేల విజ్ఞప్తులను స్వీకరించి వాటిని అధ్యయనం చేశామని అన్నారు. విద్య, ఉద్యోగాల్లో ఇకపై వచ్చే నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నుంచి భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.