తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘భూభారతి’ పోర్టల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గత ప్రభుత్వం తెచ్చిన ‘ధరణి’ పోర్టల్ రైతులకు ఉపయోగకరంగా లేదని దాని స్థానంలో కొత్తగా ఈ పోర్టల్ తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘భూభారతి’ పోర్టల్‌ను హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ పోర్టల్‌ను మొదటగా ప్రయోగాత్మకంగా 4 మండలాల్లో అమలు చేయనున్నారు. అందుకు మద్దూరు (నారాయణపేట జిల్లా), లింగంపేట (కామారెడ్డి), వెంకటాపూర్ (ములుగు), నేలకొండ పల్లి (ఖమ్మం) మండలాలను ఎంపిక చేశారు. ఈ పోర్టల్‌ను జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ప్రజల నుంచి అవసరమైన సూచనలను స్వీకరించి, పోర్టల్‌లో తగిన మార్పులు చేసే ప్రక్రియను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రారంభించారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పోర్టల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు.

previous post