రేర్ ఎర్త్స్ ఎగుమతులపై చైనా పట్టు.. అమెరికాకు కొత్త సవాళ్లు
- ఏడు కీలక రేర్ ఎర్త్ మూలకాలపై చైనా కొత్తగా ఎగుమతి నియంత్రణలు
- అమెరికా సుంకాలకు ప్రతిచర్యగా నిర్ణయం
- దిగుమతుల కోసం చైనాపై 70 శాతం ఆధారపడిన అమెరికా
- ఈవీలు, సెమీకండక్టర్లు, రక్షణ పరికరాలకు ఈ ఖనిజాలు అత్యవసరం
ప్రపంచ వాణిజ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా గతంలో చైనా ఉత్పత్తులపై విధించిన సుంకాలను దృష్టిలో ఉంచుకుని, దానికి ప్రతిగా చైనా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఏడు కీలకమైన ‘రేర్ ఎర్త్’ మూలకాల ఎగుమతులపై కొత్తగా నియంత్రణ విధించింది. ఈ మూలకాలు ఆధునిక సాంకేతికత, రక్షణ రంగాలకు అత్యంత కీలకమైనవి కావడంతో అమెరికాకు ఇది కొత్త సవాలుగా మారింది. సమారియం, గాడోలినియం, టెర్బియం, డైస్ప్రోసియం, లుటేటియం, స్కాండియం, యిట్రియం వంటి ఖనిజాలు ఈ కొత్త నియంత్రణల పరిధిలోకి వస్తాయి.
ఈ కొత్త నిబంధనలు పూర్తిస్థాయి ఎగుమతి నిషేధం కానప్పటికీ, ఇకపై ఈ ఏడు ఖనిజాలను ఎగుమతి చేయాలంటే చైనా ప్రభుత్వం నుంచి ప్రత్యేక లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. దీనివల్ల ఎవరికి ఎగుమతి హక్కులు ఇవ్వాలనే దానిపై చైనా అధికారులకు పూర్తి నియంత్రణ లభిస్తుంది. ఈ విధానం అమల్లోకి వస్తే, అమెరికా రక్షణ రంగ కాంట్రాక్టర్ల వంటి కొన్ని కంపెనీలకు ఈ కీలక ఖనిజాల దిగుమతులను నిరాకరించే అవకాశం లేకపోలేదు. వీటికి ప్రత్యామ్నాయాలను కనుగొనడం లేదా ఇతర దేశాల నుంచి పొందడం చాలా కష్టంతో కూడుకున్న పని అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గణాంకాలను పరిశీలిస్తే, రేర్ ఎర్త్ ఖనిజాల దిగుమతుల కోసం అమెరికా అధికంగా చైనాపైనే ఆధారపడుతున్న విషయం స్పష్టమవుతోంది. 2020 నుంచి 2023 మధ్య కాలంలో అమెరికా దిగుమతి చేసుకున్న మొత్తం రేర్ ఎర్త్స్‌లో 70 శాతం చైనా నుంచే వచ్చాయి. మలేషియా, జపాన్, ఎస్టోనియా దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా, కొత్త నియంత్రణల జాబితాలో ఉన్న యిట్రియం కోసం అమెరికా దాదాపు పూర్తిగా చైనాపైనే ఆధారపడి ఉంది. 2020-23 మధ్య అమెరికా దిగుమతి చేసుకున్న యిట్రియం సమ్మేళనాలలో 93 శాతం చైనా నుంచే రావడం గమనార్హం. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, యిట్రియం దిగుమతుల కోసం అమెరికా 100 శాతం ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. దీనిని ప్రధానంగా ఉత్ప్రేరకాలు, సిరామిక్స్, ఎలక్ట్రానిక్స్, లేజర్లు, లోహశాస్త్రం, ఫాస్ఫర్‌లలో ఉపయోగిస్తారు.
మొత్తం రేర్ ఎర్త్ ఖనిజాల పరంగా చూస్తే, 2024లో అమెరికా నికర దిగుమతులపై 80 శాతం ఆధారపడింది. అంటే, దేశీయ వినియోగంలో 80 శాతం దిగుమతుల (దిగుమతులు మైనస్ ఎగుమతులు) ద్వారానే భర్తీ అయ్యింది. అయితే, 2020లో ఇది 100 శాతంగా, 2021-23 మధ్య 95 శాతానికి పైగా ఉండగా, 2024లో స్వల్పంగా తగ్గింది. దేశీయంగా రేర్ ఎర్త్ సమ్మేళనాలు, లోహాల ఉత్పత్తిని అమెరికా పెంచడమే ఇందుకు కారణం. అయినప్పటికీ, కీలకమైన కొన్ని మూలకాల కోసం చైనాపై ఆధారపడటం తగ్గకపోవడం, తాజా నియంత్రణల నేపథ్యంలో అమెరికాకు వ్యూహాత్మకంగా సవాలుగా మారింది. ఈ పరిణామం భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ పరికరాల ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.