- జులైలో కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడుగా బాధ్యతలు చేపడతారన్న మక్కల్ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్
- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకేతో పొత్తుతో ఒక రాజ్యసభ సీటుకు ఒప్పందం
- జులైలో ముగియనున్న ఇద్దరు డీఎంకే రాజ్యసభ సభ్యుల పదవీ కాలం
ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ త్వరలో రాజ్యసభ సభ్యుడు కానున్నారు. గత శాసనసభ ఎన్నికలలో కమల్ హాసన్ పార్టీ డీఎంకేతో పొత్తు పెట్టుకున్న విషయం విదితమే. ఆ క్రమంలో ఒక రాజ్యసభ సీటును కమల్ పార్టీకి కేటాయించేందుకు డీఎంకేతో ఒప్పందం కుదిరింది.
డీఎంకేకు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది జులైలో ముగియనున్న నేపథ్యంలో, వారిలో ఒకరి స్థానంలో కమల్ హాసన్‌కు అవకాశం కల్పించవచ్చనే చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో మక్కల్ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్ దీనిపై కీలక ప్రకటన చేశారు.
తమిళనాడులోని కోయంబత్తూరులో సోమవారం జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న తంగవేల్ మీడియాతో మాట్లాడుతూ, కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపాలని పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించిందని వెల్లడించారు. త్వరలో రాజ్యసభ సభ్యుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని ఆయన తెలిపారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం అమెరికాలో ఉన్న కమల్ హాసన్ తిరిగి వచ్చిన తర్వాత జులైలో ఆ బాధ్యతలు స్వీకరిస్తారని తంగవేల్ పేర్కొన్నారు.