- రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర
- ఇల్లెందులో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం

వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఇల్లెందు నియోజకవర్గం నుండి గులాబీ దండు వేలాదిగా కదం తొక్కాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపు నిచ్చారు. ఈ సభకు హాజరయ్యే పార్టీ శ్రేణులను చూసి కాంగ్రెసోళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలన్నారు. మాజీ శాసన సభ్యురాలు బాణోత్ హరిప్రియా నాయక్ అధ్యక్షతన మంగళవారం ఇల్లెందు నియోజకవర్గ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పది లక్షల మందితో జరిగే వరంగల్ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతరోనని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఏడాదిన్నరకే ప్రజలు విసిగి, వేసారి పోయారని అన్నారు. ఆచరణలో సాధ్యం కాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయ లేక చేతులెత్తేశారని విమర్శించారు. కేసీఆర్ ను దూరం చేసుకుని తప్పు చేశామని ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేద్దామని భ్రమ పడుతున్న ముఖ్యమంత్రి, తాను కూర్చున్న కుర్చీ కూడా కేసీఆర్ పెట్టిన బిక్షేనని గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ పోరాటం చేయక పోతే ఇవాళ రాష్ట్రమే వచ్చేది కాదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అద్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ వరంగల్ సభను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్ధేశం చేశారు. బహిరంగ సభకు హాజరయ్యే ముందు, పార్టీ కార్యకర్తలంతా తమ తమ గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి బయలు దేరాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు దిండిగాల రాజేందర్, మహబూబాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్ ఆంగోత్ బిందు, డిసీసీబీ మాజీ డైరెక్టర్ లక్కినేని సురేందర్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు సంజీవ్ నాయక్, వివిధ మండలాల పార్టీ బాధ్యులు శీలం రమేష్, బొమ్మెర ప్రసాద్, తాతా గణేష్, లక్ష్మణ్ నాయక్, పరుచూరి వెంకటేశ్వరరావు, టీబీజీకేఎస్ నాయకులు రంగనాధ్, జాఫర్ హుస్సేన్, జెకే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.