జాతీయ రహదారుల అభివృద్ధికి తక్షణ చర్యలు అవసరం
•రాజమార్గానికి …సేవా,అనుసంధాన మార్గాలు నిర్మించండి
•సీఎం రేవంత్ ని కోరిన మంత్రి తుమ్మల
•ప్రధాన సమస్యలపై సీఎంకు మంత్రి తుమ్మల లేఖ
•రహదారుల అవసరాల దృష్ట్యా ప్రాధాన్యత కల్పించండి
•ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్డు కల్పించండి
•ఖమ్మం నగరానికి రింగ్ రోడ్డు 7 కిమీటర్ల అనుసందానించాలి
•జగ్గయ్యపేట కొత్తగూడెం నేషనల్ హైవే మంజూరుకు మంత్రి వినతి
•రహదారుల నిర్మాణంతో పరిశ్రమలు, పర్యాటక రంగం అభివృద్ధి
•కలెక్టర్లు నేషనల్ హైవే అధికారుల తో సమీక్షలో సీఎం రేవంత్ ను లేఖ ద్వారా కోరిన తుమ్మల
ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారి అభివృద్ధి, అనుసంధాన రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లాలో రవాణా సౌకర్యాల మెరుగుదల,పారిశ్రామిక పురోగతికి రహదారుల విస్తరణ, అనుసంధానంతో సాధ్యమవుతుందని తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్లు, నేషనల్ హైవే అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో లేఖ ద్వారా ఈ అంశాలను తుమ్మల ప్రస్తావించారు. రహదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ ప్రాధాన్యతనిస్తూ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లకు మంత్రి తుమ్మల లేఖలను అందించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను వారికి వివరించారు.
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే (జాతీయ రహదారి)కి ఖమ్మం నియోజకవర్గ పరిధిలో రెండు వైపులా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల కోరారు.
ఖమ్మం నగరానికి రింగ్ రోడ్డు పూర్తి అయ్యేలా ఖమ్మం – కొరివి రోడ్డు నుండి నూతన కలెక్టరేట్ (అమరావతి నాగపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే) వరకు7 కిలోమీటర్ల రహదారిని. రింగ్ రోడ్ కు అనుసంధానంగా తక్షణం మంజూరు చేయాలని సీఎంను కోరారు.
జగ్గయ్యపేట–కొత్తగూడెం వయా బోనకల్, వైరా, తల్లాడ నేషనల్ హైవే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ కేంద్రానికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ రహదారులు పూర్తి చేస్తే ఖమ్మం జిల్లాలో పరిశ్రమలకు, వాణిజ్యానికి, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా భద్రాచలం, పాల్వంచ, మణుగూరు, అశ్వాపురం వంటి పారిశ్రామిక పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాద్రి రామాలయం కొత్త శోభ సంతరించుకొని ఉందని పేర్కొన్నారు.అలాగే పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలు సులభంగా అనుసంధానమవుతాయని పేర్కొన్నారు. దీంతో ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా సారపాక నుండి కాలేశ్వరం వరకు వయ అశ్వాపురం.ఎటూరి నాగారం జాతీయ రహదారిని మంజూరు చేయాలని. బూర్గంపాడు నుండి జంగారెడ్డిగూడెం వరకు వయ ములకలపల్లి. దమ్మపేట వరకు నూతన జాతీయ రహదారిని మంజూరు చెయ్యాలని కోరినారు. రహదారుల విస్తరణ, బైపాస్ అనుసంధానం, కొత్త నేషనల్ హైవే మంజూరుపై దృష్టి సారించాలని మంత్రి తుమ్మల కోరారు. ప్రజా రవాణా, పరిశ్రమలు, పర్యాటక రంగాల అభివృద్ధి కోసం ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ కేంద్రానికి పంపితేనే ప్రాంతీయ ప్రజలు నిజమైన లాభం పొందుతారని మంత్రి అభిప్రాయపడ్డారు.రహదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ తక్షణ ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.