- నదీ జలాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ సరికాదు
- మూసి, డిండి ప్రాజెక్టులను కూడా గెజిట్ లో పొందుపరచడమేంటి?
- కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా నీటిని వినియోగించుకునే వీలు లేదు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదం రాజుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నది జలాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయంపై తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ చర్య అత్యంత దారుణమని అన్నారు.
రాష్ట్రాన్ని ఎడారిగా మార్చేందుకు కేంద్ర సర్కారు కుట్ర పన్నిందని, నిజాం రాజులు కట్టిన మూసి, డిండి ప్రాజెక్టులను కూడా గెజిట్ లో పొందుపరచడమేంటని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా నీటిని వినియోగించుకునే వీలు లేకుండా చేస్తోందని ఆరోపించారు.
అప్పట్లో తెలంగాణ నాయకుల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో పాలకులు మన నాయకుల నోళ్లు మూయించారని ఆయన చెప్పారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను పూర్తి చేశారన్నారు. దీంతో ఓర్వలేకే బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు.
రాష్ట్రంంలో బీజేపీని ప్రజలు ఆదరించరనే కక్ష్యపూరితంగా ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చిన్న ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడక తప్పదని చెప్పారు. బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.